మెహుల్ చోక్సీ లాంటి మరో నలుగురు పారిశ్రామిక వేత్తలు!
మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నితిన్ సందేసరా వీరంతా దేశం నుంచి పారిపోయిన పారిశ్రామిక వేత్తలు.;

దేశంలో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేసిన పారిశ్రామిక వేత్తల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది. ఎప్పుడో దేశం విడిచి వెళ్లిన వారిని తిరిగి ఇక్కడికి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా శ్రమపడుతోంది. ప్రస్తుతం బెల్జియంలో అరెస్టు అయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఉదంతంతో దేశం నుంచి పారిపోయిన పారిశ్రామిక వేత్తలపై మళ్లీ చర్చ మొదలైంది. మెహుల్ చోక్సీ, ఆయన బంధువు నీరవ్ మోదీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టారు. ఈ కేసులోనే మెహుల్ చోక్సీ అరెస్టు అయ్యారు. ఇక ఆయనలాంటి మరో నలుగురు పారిశ్రామిక వేత్తలు కూడా బ్యాంకులను భారీగా మోసం చేసి ఉడాయించిన వైనం మరోసారి తెరపైకి వచ్చింది.
మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నితిన్ సందేసరా వీరంతా దేశం నుంచి పారిపోయిన పారిశ్రామిక వేత్తలు. వీరిలో మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ బంధువులు కాగా, మిగిలిన ముగ్గురికి ఒకరితో ఒకరికి సంబంధం లేదు. కానీ, ఈ ఐదుగురి అరెస్టు కోసం కేంద్రం సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ఎట్టకేలకు మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టుచేసి స్వదేశానికి తీసుకువస్తుండటంతో మిగిలిన వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారని ప్రశ్న వినిపిస్తోంది.
2018లో పీఎన్బీ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర ముంచేసిన వ్యక్తులుగా మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీపై కేసులు నమోదయ్యాయి. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై పీఎన్బీని మోసం చేశారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ మోసం వెలుగుచూశాక ఇద్దరూ దేశం విడిచి పారిపోగా, నీరవ్ మోదీ 2019లో లండన్ లో అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి ఆయనను తిరిగి మన దేశానికి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా, ఇప్పటికీ ఆ ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఇప్పుడు చోక్సీ అరెస్టుతో నీరవ్ మోదీ అప్పగింతపై మళ్లీ చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో 9 వేల కోట్లు ఎగవేసిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా, ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలంలో అవకతవకలకు పాల్పడిన లలిత్ మోదీ, 5,700 కోట్ల మేర మనీలాండరింగుకి పాల్పడిన ఆరోపణలపై మరో పారిశ్రామిక వేత్త నితిన్ సందేసరా కూడా దేశం విడిచి పారిపోయారు. వీరిలో విజయ్ మాల్యా, లలిత్ మోదీ బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు. నేరస్తుల అప్పగింతపై బ్రిటన్ తో మన దేశానికి అవగాహన ఉన్నా, నిందితులు అప్పగింతలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. బ్రిటన్ - భారత్ మధ్య నేరస్తుల అప్పగింతకు 1992లోనే ఒప్పందం కుదిరినా ఈ 33 ఏళ్లలో ఒక్కరిని మాత్రమే అప్పగించారు. దీంతో విజయ్ మాల్యా, లలిత్ మోదీ సురక్షితంగా గడిపేస్తున్నారు. ఇక నితిన్ సందేసరా కుటుంబం భారత్ నుంచి దుబయ్ మీదుగా నైజీరియాకు వెళ్లిపోయింది. సందేసరా కుటుంబం నైజీరియా, అల్బేనియా దేశాల పౌరసత్వం తీసుకుని అక్కడే గడిపేస్తోంది.