ఫ్యూచర్స్.. ఆప్షన్స్ లో ట్రేడింగ్.. సెబీ తాజా మాట విన్నారా?
చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ట్రేడింగ్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ట్రేడింగ్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థిక అంశాల మీద అవగాహనతో పాటు.. సంపాదనకు సింఫుల్ మార్గంగా షేర్ మార్కెట్ మారింది. కరోనా వేళలో మొదలైన ఈ ట్రెండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గతానికి భిన్నంగా షేర్ మార్కెట్ లో ఎన్నో రకాల ట్రేడింగ్ అవకాశాలున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ వ్యవధిలో భారీగా సంపాదించే అవకాశం ఉన్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ & ఓ ట్రేడింగ్) లో ట్రేడింగ్ చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది.
ఇందులో ట్రేడింగ్ చేసే వారికి రిస్కు భారీగా ఉంటుంది. అదే సమయంలో రిటర్న్స్ కూడా అంతే ఎక్కువ. ఈ కారణంతో ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపే సంఖ్య ఎక్కువ అవుతోంది. తాజాగా ఈ ట్రేడింగ్ కు సంబంధించిన ఒక నివేదిక వెల్లడించింది. అంతేకాదు.. ఇందులో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని ప్రస్తావించటం ద్వారా..కేర్ ఫుల్ గా ఉండాలన్న విషయాన్ని చెబుతోంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ & ఓ ట్రేడింగ్ చేసిన వారిలో 91 శాతం మంది నష్టాల బారిన పడినట్లుగా పేర్కొన్నారు. ఈ విభాగంలో పెట్టుబడి పెట్టిన సుమారు 73 లక్షల మంది వ్యక్తిగత మదుపరులు నష్టాల బారిన పడిన వైనాన్ని పేర్కొంది. మరింత అర్థమయ్యేలా ఇదే అంశం గురించి చెబుతూ.. ‘‘ప్రతి 10 మందిలో 9 మందికి నష్టాలు ఎదురవుతున్నాయి. వీరు సగటున రూ.1.2లక్షల చొప్పున నష్టం ఎదుర్కొంటున్నారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల లెక్క తీస్తే ఇందులో పెట్టుబడులు పెట్టే వారిలో 93 శాతం పైనే నష్టాల బారిన పడుతున్నారు’’ అని పేర్కొంది.
దాదాపు కోటి మంది ట్రేడర్లు యావరేజ్ గా రూ.2లక్షల వరకు నష్టపోయినట్లుగా పేర్కొంది. మూడేళ్ల వ్యవధిలో దగ్గర దగ్గర రూ.1.8లక్షల కోట్ల మేర నష్టపోయినట్లుగా వెల్లడించింది. ఒక్క 2023- 24 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో నష్టపోయిన మొత్తం రూ.75 వేల కోట్లుగా ఉంది. సుమారు 4 లక్షల మంది మదుపరులు సగటున రూ.28 లక్షలు చొప్పున నష్టపోయారని సెబీ గణాంకాలు చెబుతున్నాయి.
మరి.. లాభాలు ఆర్జించిన వారు ఎవరూ లేరా? అంటే ఆ వివరాల్ని వెల్లడించింది సెబీ. లాభాలు ఆర్జించిన 7.2 శాతం ట్రేడర్లలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే రూ.లక్ష కంటే ఎక్కువ లాభం పొందారని పేర్కొంది. 2021-22లో 51 లక్షలుగా ఉన్న రిటైల్ ట్రేడర్ల సంఖ్య 96 లక్షలకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్ లో వీరి వాటా 30 శాతం ఉండటం గమనార్హం. ఎఫ్ & ఓలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతున్న వేళ ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సెబీ పేర్కొంది. దీనికి సంబంధించిన రిపోర్టులో పేర్కొన్న వివరాల్ని చూస్తే..
- 30 ఏళ్ల లోపు ఎఫ్ & ఓ ట్రేడర్ల సంఖ్య 2022-23లో 31 శాతం. ఏడాదిలో ఈ సంఖ్య 43 శాతానికి పెరిగింది.
- ప్రతి పది మంది పెట్టుబడి పెట్టే వారిలో నలుగురు వీరే.
- 2021-22 ఆర్థిక సంవత్సరంలో 89 శాతం మంది ఎఫ్ & ఓ లో నష్టపోయారు.
- మొత్తం ఎఫ్ & ఓ ట్రేడర్లలో 91 శాతం మంది నష్టపోతుంటే.. యువ ట్రేడర్లలో ఆ సంఖ్య 93 శాతం ఉంది.
- ఎఫ్ & ఓ లో పెట్టుబడి పెట్టే వ్యక్తిగత మదుపరులలో 75 శాతం మంది వార్షిక ఆదాయం కేవలం రూ.5 లక్షలలోపే.
- ఎఫ్ & ఓ ట్రేడింగ్ లో మహిళల భాగస్వామ్యం 2021-22లో 14.9 శాతం ఉంటే.. ఆ తర్వాత అది కాస్తా 13.7 శాతానికి తగ్గటం విశేషం.