జీ20 కి భారత్ పెట్టిన ఖర్చు ఇది... దక్కే ఫలితాలివి!

ఇండియా వేదికగా జరిగిన అత్యంత కీలకమైన జీ-20 సదస్సు రెండు రోజుల పాటు జరిగిన సంగతి తెలిసిందే.

Update: 2023-09-10 11:12 GMT

ఇండియా వేదికగా జరిగిన అత్యంత కీలకమైన జీ-20 సదస్సు రెండు రోజుల పాటు జరిగిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రాముఖ్యమైన ఈ సదస్సుకు ఈ సారి ఇండియా వేదికగా నిలిచింది. ఈ సమయంలో ఈ సదస్సుకు ఇండియా పెట్టిన మొత్తం ఖర్చెంత అనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో అందుకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అవును... జీ-20 సదస్సుకోసం 30 మంది దేశాధినేతలతో పాటు 14 మంది అంతర్జాతీయ సంస్థల అధినేతలు హాజరయిన సంగతి తెలిసిందే. దీని కోసం కేంద్రం ఎంత ఖర్చు చేసిందనే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ సమయంలో జీ20 సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ సర్కార్... న భూతో న భవిష్యత్ అన్నట్లుగా ఏర్పాట్లు చేసింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బంగ్లాదేశ్ ప్రధానితో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరయ్యారు. ఈ సమయంలో ఈ స్థాయిలో ఏర్పాట్లు చేసిన శిఖరాగ్ర సమావేశానికి ప్రతిఫలంగా భారత్‌ కు దక్కే ప్రతిపలమేంటనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో ముందుకు ఈ సదస్సుకు అయిన ఖర్చు కు సంబంధించి వస్తోన్న కొన్ని నివేదికల ప్రకారం.. జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీని రెడీ చేసేందుకు కేంద్రం రూ.4254.75 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుంది. రోడ్లు, సెక్యూరిటీ, లైటింగ్‌ తో పాటు ఇతర పనుల కోసం ఈ డబ్బును ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని శాఖల నుండి ఈ వ్యయం ఖర్చు చేయడం జరిగిందని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... ఈ సదస్సు ద్వారా భారత్ కు కలిగే ప్రయోజనాలేమిటి.. ఈ శిగరాగ్ర సమావేశం వల్ల ఒనగూరే ఫలితాలేమిటి అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో... భారత్, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో... ఇలాంటి పరిస్థితుల్లో జి20 సమ్మిట్ ద్వారా ఈ బంధం మరింత బలంగా మారనుందని అంటున్నారు.

ఇదే సమయంలో... చైనా, అమెరికా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం ద్వారా భారతదేశం లాభపడే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చైనాలో అమెరికన్ ఐఫోన్ల వినియోగంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇది భారత్ కు కలిసొచ్చే అంశం అని అంటున్నారు. కారణం... అమెరికన్ కంపెనీలకు పెద్ద ఆప్షన్‌ గా ఇండియా మారనుంది.

ఇండియా - అమెరికా దేశాల మధ్య రెన్యూవబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ పై ఒప్పందం కుదిరింది. దీనికోసం రెండు దేశాలు కలిసి ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఇది పునరుత్పాదక శక్తి, గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి అవకాశాన్ని అందిస్తుందని తెలుస్తుంది.

ఇదే సమయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఇండియా ప్రధాని మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ధాన్యం ఒప్పందంతోపాటు ఎం.ఎస్.సి.ఏ. ఫైటర్ జెట్ ఇంజిన్‌ కు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని అంటున్నారు.

ఈ సమయంలో ప్రపంచంలోని 19 శక్తివంతమైన దేశాల నాయకులు ఇండియాలో సమావేశమయ్యారు. ఈ దేశాలు భారతదేశానికి రావడం వల్ల పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. తదనుగుణంగా కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని చెబుతున్నారు.

Tags:    

Similar News