కేసీయార్ గజ్వేల్ సెంటిమెంట్...!

బీయారెస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ వయసు డెబ్బై ఏళ్ళు. ఆ సంగతి ఆయన ఎన్నికల సభలలోనే చెప్పుకున్నారు

Update: 2023-11-29 02:30 GMT

బీయారెస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ వయసు డెబ్బై ఏళ్ళు. ఆ సంగతి ఆయన ఎన్నికల సభలలోనే చెప్పుకున్నారు. ఈ వయసులో కూడా కేసీయార్ నవ యువకుడిగానే ప్రచారం నిర్వహించారు. అన్నీ ముహూర్తాలు చూసుకుని పని మొదలెట్టే కేసీయార్ అక్టోబర్ 15న తెలంగాణా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దాదాపుగా వంద నియోజకవర్గాలలో కేసీయార్ ప్రచారం సాగింది.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కేసీయార్ మొదట ప్రచారం స్టార్ట్ చేసింది హుస్నాబాద్ నియోజకవర్గంలో. అక్కడ నుంచే ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. అది లగాయితూ అలుపు అన్నది లేకుండా దాదాపుగా 45 రోజుల పాటు కేసీయార్ తెలంగాణాను సుడిగాలిగా చుట్టేశారు.

అయితే కేసీయార్ గ్రేటర్ హైదరాబాద్ లోని నియోజకవర్గాలను మాత్రం టచ్ చేయేలేదు. ఆయన టూర్లు అన్నీ తెలంగాణాలోని మిగిలిన జిల్లాల్లో సాగాయి. కేసీయార్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయడం విశేషం. అందులో ఒకటి ఆయన్ని రెండు సార్లుగా గెలిపించి సీఎం గా చేసిన గజ్వేల్ నుంచి. రెండవది కామారెడ్డి నుంచి.

ఈ రెండు సీట్లలో బంపర్ మెజారిటీతో గెలవాలని మాత్రం బీయారెస్ పట్టుదలగా ఉంది. కేసీయార్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక సార్లు గజ్వేల్ కామారెడ్డిలకు వచ్చారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి మాత్రం ఆయన గజ్వేల్ లోనే తన ప్రచారాన్ని ముగించడం గమనార్హం.

అంటే ఆయనకు ఉన్న సెంటిమెంట్ లో భాగంగానే ఇలా చేశారా అన్న చర్చ వస్తోంది. ఎక్కడికి ఏది అవసరమో ఆ ఇష్యూని తీసుకుని మరీ కేసీయార్ ప్రసంగాలు చేశారు. ఆయన దివంగత నేత ఇందిరాగాంధీని కూడా ఎన్నికల ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. అలాగే ఎంటీయార్ ని కూడా అదే సమయంలో లాగారు.

బీజేపీని కాంగ్రెస్ ని ఆయా జిల్లాలలో వాటికి ఉన్న బలం పట్టి ఎక్కడా స్పేర్ చేయకుండా గట్టిగానే కేసీయార్ విమర్శించారు. జాతీయ పార్టీల మీద ఆయన విరుచుకుపడడం విశేషం. ప్రాంతీయ ఆకాంక్షలు అవి నెరవేర్చలేవు అని ఆయన ఒక నినాదంగా విధానంగా చేసుకుని చెప్పుకొచ్చారు.

అదే విధంగా ఆయన తెలంగాణాలోని ప్రత్యర్ధులను ఎవరినీ వదలకుండా విమర్శించారు. అయితే చంద్రబాబు పేరుని ఆయన ఎత్తలేదు. టీడీపీ ఈసారి పోటీ నుంచి దూరంగా ఉండడమే అందుకు కారణం. 2018లో ఎక్కడ చూసినా చంద్రబాబు మీదనే ఘాటైన విమర్శలు చేసే కేసీయార్ ఈసారి మాత్రం పూర్తిగా వదిలేశారు. దాని వెనక వ్యూహం ఉంది అంటున్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసినా పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా కూడా కేసీయార్ ఆయన మీద కూడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మొత్తంగా కేసీయార్ గాయం ఎక్కడ ఉందో మందు అక్కడ అన్నట్లుగా తమ పార్టీ బలాలు బలహీనతలు, ప్రత్యర్ధి పార్టీల బలాలు బలహీనతలు వీటినే విశ్లేషించుకుని తన స్పీచ్ ఇచ్చారని అర్ధం అవుతోంది. కేసీయార్ హ్యాట్రికి సీఎం ఆకాంక్ష మీద జనాలు తీర్పు ఏమిటి అన్నది చూడాలి మరి.

Tags:    

Similar News