మోడీ సర్కార్ ని పొగుడుతూనే ఇచ్చి పడేశారు...!

టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారికి సారీ అంటూ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటారు

Update: 2024-02-06 01:30 GMT

టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారికి సారీ అంటూ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటారు. అయితే ఇది జస్ట్ విరామం అని ఆయన ప్రకటించారు. అంతే కాదు శ్రీరాముడు వనవాసం ఉదంతాన్ని కూడా ముందుకు తెచ్చారు రాముడు పద్నాలుగేళ్ల పాటు అరణ్యవాసం మాదిరిగానే తాను కొన్నాళ్ళు రాజకీయ వనవాసం చేస్తాను అని ఆ మీదట వస్తాను అని చెప్పుకున్నారు.

ఇక ఆయన లోక్ సభ ఎంపీగా పార్లమెంట్ ప్రస్తుతం జరిగే చివరి సమావేశాలలో మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ఆయన ప్రసంగం ప్రారంభించారు. మోడీ ఎంతో విజన్ ఉన్న నాయకుడు అని గల్లా ప్రశంసించారు. పదేళ్ల మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి సాధించింది అని ఆయన చెప్పారు.

అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి భారతీయుల శతాబ్దాల కలను నెరవేర్చిన ధీరుడు మోడీ అని జయదేవ్ అన్నారు. ఇలా మోడీని పొగుడుతూనే తన టోన్ మార్చారు. వ్యాపారుల మీద దాడులు దేశంలో పెరిగిపోతున్నాయని విపక్ష స్వరం వినిపించేసారు

దేశం అభివృద్ధికి ప్రజాస్వామ్య పాలనకు వ్యాపారులది కూడా ముఖ్య పాత్ర అని జయదేవ్ అన్నారు. దేశంలో నుంచి చూస్తే ఎంతో మంది వ్యాపారులు చట్టసభలకు నెగ్గుతూ ఉంటారని ఆయన గుర్తు చేశారు అయితే వ్యాపారవేత్తల మీద రాజకీయ కక్షలు ఎక్కువ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నివారించాల్సిన అవసరం ఉందని ఆయన మోడీ ప్రభుత్వానికి సూచించారు.

అదే సమయంలో ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సినవి అన్నీ రావాలని ఆయన కోరారు. ఏపీలో విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన హామీలను నెరవేర్చాలని అన్నారు. అమరావతి రాజధాని రైతులకు తన మద్దతు అని కూడా పార్లమెంట్ సాక్షిగా చెబుతూ అదే ఏపీకి రాజధాని అన్నట్లుగా మరోసారి స్పష్టం చేసారు.

ఏపీలో జరగనున్న ఎన్నికలు స్వేచ్చగా సాగాలని, దొంగ ఓట్లు ఏపీలో ఉన్నాయన్న ఆరోపణల మీద ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం విశేషం. మొత్తానికి గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తాత్కాలికంగా అయినా వైదొలగడానికి కారణం కేంద్ర స్థాయిలో సంస్థల నుంచి వేధింపులా అన్న చర్చ మొదలైంది. ఏది ఏమైనా ఆయన అటు మోడీని ఇటు చంద్రబాబుని పొగిడారు. బీజేపీకి సూచనలు ఇస్తూనే అమరావతి భేష్ అన్నారు. వైసీపీని లోక్ సభలో నిందించారు. ఇక చాలు తన ఎంపీ పదవి అని జయదేవ్ తుది ప్రసంగంతో ముగించారు.

Tags:    

Similar News