గల్లా చూపు ఈ పదవిపైనే!

2019లో వైసీపీ సునామీని తట్టుకుని మరీ విజయం సాధించిన కొద్దిమందిలో ఆయన ఒకరు.

Update: 2024-08-27 05:49 GMT

ప్రముఖ సినీ నటుడు మహేశ్‌ బాబు బావ, ప్రముఖ పారిశ్రామికవేత్త, గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఇటీవల ఎన్నికల్లో పోటీ చేయని సంగతి తెలిసిందే. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలుపొందారు. 2019లో వైసీపీ సునామీని తట్టుకుని మరీ విజయం సాధించిన కొద్దిమందిలో ఆయన ఒకరు.

కాగా వైసీపీ ప్రభుత్వంలో గల్లా జయదేవ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయనకు చెందిన అమర్‌ రాజా బ్యాటరీస్‌ కాలుష్య ప్రమాణాలు పాటించడం లేదంటూ అధికారులు దానికి సీల్‌ వేశారు. దీంతో గల్లా హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు పొందారు. అయినప్పటికీ టీడీపీ ఎంపీ అనే ఒక్క కారణంతో వైసీపీ ప్రభుత్వం గల్లా జయదేవ్‌ కు చెందిన పరిశ్రమల పట్ల తీవ్ర వేధింపులకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురయిన గల్లా జయదేవ్‌ ఏపీలో నెలకొల్పాలనుకున్న అమర్‌ రాజా బ్యాటరీస్‌ కొత్త ప్లాంట్‌ ను తెలంగాణకు తరలించేశారు. రూ.7,500 కోట్ల విలువైన పెట్టుబడులను ఈ ప్లాంట్‌ కింద ఆ రాష్ట్రంలో గల్లా జయదేవ్‌ పెట్టారు. ఈ వ్యవహారం పారిశ్రామికవర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందనే ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.

రాజకీయాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలను అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలు వేధిస్తున్నాయని గల్లా జయదేవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల ఎన్నికల నుంచి స్వచ్చంధంగా తప్పుకున్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిపారు. అయితే టీడీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. దీంతో గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్‌ కు చంద్రబాబు అవకాశమిచ్చారు.

కాగా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలో ఉండటంతో గల్లా జయదేవ్‌ రాజ్యసభ సీటును ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2026లో ఏపీకి సంబంధించి రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఇందులో ఒక సీటుపై ఆయన కన్నేశారని చెబుతున్నారు. ఇప్పటికే తన మనసులో మాటను చంద్రబాబుకు సైతం చేరవేశారని అంటున్నారు.

చంద్రబాబు సైతం గల్లా జయదేవ్‌ కోరికకు సమ్మతించారని అంటున్నారు. రెండుసార్లు లోక్‌ సభ ఎంపీగా పనిచేయడంతోపాటు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా గల్లా జయదేవ్‌ ఉన్నారు. అంతేకాకుండా అనర్ఘళంగా తెలుగు, ఇంగ్లిషుల్లో మాట్లాడగలరు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

అయితే 2026 వరకు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ముందుగా గల్లా జయదేవ్‌ ను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారని అంటున్నారు. ఈ పదవికి కేబినెట్‌ మంత్రి హోదా ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశమిస్తారని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు