రాజకీయాలకు గుడ్ బై... టీడీపీ ఎంపీ ఫేర్ వెల్ మీటింగ్!
ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ రంగం నుంచి బయటకు వెళ్లాలని, రిటైర్ మెంట్ ప్రకటించాలని మెజారిటీ నేతలకు అనిపించదని అంటుంటారు
ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ రంగం నుంచి బయటకు వెళ్లాలని, రిటైర్ మెంట్ ప్రకటించాలని మెజారిటీ నేతలకు అనిపించదని అంటుంటారు. అయితే అందుకు విరుద్ధంగా రెండుసార్లు ఎంపీగా పనిచేసిన టీడీపీ నేత మాత్రం... రాజకీయాలకు ఇక గుడ్ బై అంటున్నారు. ఈ సందర్భంగా తనను రెండు సార్లు సహకరించి, ఆదరించిన వారందరికీ థాంక్స్ చెబుతున్నారు. దానికోసం భారీ మీటింగ్ విత్ విందు ఏర్పాటు చేశారు.
అవును... టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్ల జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఈరోజు గుంటూరులో కృతజ్ఞతా సభ నిర్వహిస్తున్నారు. సుమారు పది సంవత్సరాలు పాటు తనకు సహకరించిన, ఆదరించిన వారందరికీ కృత్యజ్ఞతలు తెలిపేందుకు సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు, సభ అనంతర విందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా హాజరుకానున్నారు.
తెలుగుదేశం పార్టీతో పాటు పార్లమెంటులోనూ గల్లా జయదేవ్ క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమరావతి ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. అమరావతి గురించి పార్లమెంటులోనూ మాట్లాడారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన.. రానున్న ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీకి కార్యక్రమాల నుంచి కూడా పూర్తిగా తప్పుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది!
కాగా... 2014లో గుంటూరు ఎంపీగా పోటీచేసిన జయదేవ్... వైసీపీ అభ్యర్థి బాలశౌరిపై 69,222 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం 2019లో జగన్ వేవ్ లోనూ గెలిచారు. ఇందులో భాగంగా.. హోరా హోరీగా సాగిన ఆ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల రెడ్డి పై 4,205 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక మూడోసారి బరిలోకి దిగాలని అనుకోవడం లేదు.
ఈ క్రమంలో తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ రోజు సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులంతా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తుంది.