లోకేశ్ పై వ్యాఖ్యలు నేను చేయలేదు: టీడీపీ ఎంపీ ఖండన!
అయితే గల్లా జయదేవ్.. లోకేశ్ వ్యవహారంపై కినుక వహించే పాదయాత్రకు హాజరు కాలేదని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాదయాత్ర గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు.
మరోవైపు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో జరిగిన నారా లోకేశ్ పాదయాత్రలకు స్థానిక టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్ (గుంటూరు), కేశినేని నాని (విజయవాడ) హాజరు కాలేదు. దీంతో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ పోటీ చేయరని.. ఆయనకు రాజకీయాల నుంచి విరమించుకుని పూర్తిగా వ్యాపారాలకే అంకితమవుతారని అంటున్నారు. జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గుంటూరు ఎంపీగా టీడీపీ తరఫున గెలుపొందారు.
అయితే గల్లా జయదేవ్.. లోకేశ్ వ్యవహారంపై కినుక వహించే పాదయాత్రకు హాజరు కాలేదని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. లోకేశ్ సీనియర్ నేతలను విస్మరిస్తూ కొత్తగా వచ్చినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని.. తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని జయదేవ్ బాధపడ్డారని ఆ కథనాల సారాంశం. అందుకే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరిగిన పాదయాత్రకు డుమ్మా కొట్టారని గాసిప్స్ వినిపించాయి.
అంతేకాకుండా లోకేశ్ ను విమర్శిస్తూ జయదేవ్ మాట్లాడినట్టు ప్రత్యర్థులు సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన ట్వీట్ చేశారు.
"టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి మీద, ఆయన తలపెట్టేన పాదయాత్ర మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశానని వాట్సాప్‌లో మరియు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నేను ఈ వాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా, ఒట్టి నా ఫోటో వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు. నేను ఈ వార్తలని, వీరు అవలంబించిన పద్ధతులని తీవ్రంగా ఖండిస్తున్నాను" అని జయదేవ్ ట్వీట్ చేశారు.
దీంతో గల్లా జయదేవ్.. లోకేశ్ పై చేశారని చెబుతున్న వ్యాఖ్యలు అబద్ధమని తేలిపోయింది. ఇది కావాలని ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు చేసిన పనేనని వెల్లడైంది. అయితే జయదేవ్ తాను లోకేశ్ పాదయాత్రకు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. తన నియోజకవర్గంలో పాదయాత్ర జరిగినా జయదేవ్ హాజరు కాకపోవడం పలు ఊహాగానాలకు ఊతమిచ్చింది.