బీజేపీకి ప్రపంచ కప్ విన్నింగ్ క్రికెటర్ల షాక్

అయితే, ఈ ప్రముఖుల్లో ఓ క్రికెటర్ కూడా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఇక మరో క్రికెటర్ అయితే తాను బీజేపీ తరఫున ఈసారి పోటీచేయడం లేదని ప్రకటించి జాబితాకు ముందే షాక్ ఇచ్చారు.

Update: 2024-03-02 06:36 GMT

లోక్ సభ ఎన్నికలకు మరొక్క వారం, పది రోజుల్లో షెడ్యూల్ రానుంది. దీంతోనే దేశవ్యాప్తంగా రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాని మోదీ నెల కిందటి నుంచే రాష్ట్రాలను చుట్టివస్తున్నారు. శుక్రవారం బెంగాల్ వెళ్లిన ఆయన సోమవారం తెలంగాణకు రానున్నారు. ఈ మధ్యలోనే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తారనే ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఇందులో మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖ బీజేపీ నేతలకు టికెట్ల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ ప్రముఖుల్లో ఓ క్రికెటర్ కూడా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఇక మరో క్రికెటర్ అయితే తాను బీజేపీ తరఫున ఈసారి పోటీచేయడం లేదని ప్రకటించి జాబితాకు ముందే షాక్ ఇచ్చారు.

వరల్డ్ కప్ లలో మోస్ట్ సక్సెస్ ఫుల్

టీమిండియా చివరిసారిగా 2011లో వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. అంతకుముందు 2007లో తొలి టి20 ప్రపంచ కప్ ను నెగ్గింది. ఈ రెండుసార్లూ అత్యంత కీలక పాత్ర పోషించారు ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, ఓపెనర్ గౌతమ్ గంభీర్. 2007 టి20 ప్రపంచ కప్ లో యువరాజ్ ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో కొట్టిన ఆరు సిక్సులు ఇప్పటికీ హైలైట్. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 30 బంతుల్లోనే 70 పరుగులు కొట్టాడు. మరోవైపు సెమీస్ లో గంభీర్ 24 కీలక పరుగులు చేశాడు. ఫైనల్లో మాత్రం పాకిస్థాన్ పై 75 పరుగుల అత్యంత గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. మళ్లీ వీళ్లిద్దరే 2011 ప్రపంచ కప్ లోనూ అద్భుతంగా రాణించారు. యూవీ అయితే ఆల్ రౌండ్ ప్రదర్శన పతాక స్థాయిలో సాగింది. 12 మ్యాచ్ లలో 90 సగటుతో 362 పరుగులు చేయడమే కాక.. 25.33 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. నాటి టోర్నీలో అతడే మ్యాన్ ఆఫ్ ద సిరీస్. మరోవైపు ఫైనల్లో గంభీర్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సచిన్, సెహ్వాగ్ వంటి వారు అతి తక్కువ స్కోరుకే వెనుదిరిగిన సమయంలో శ్రీలంక బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు అతడు. 97 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇదీ ఆ రెండు ప్రపంచ కప్ లలో టీమిండియా విజయగాథలో యూవీ, గంభీర్ పాత్ర.

గంభీర్ ఇలా

2007 తర్వాత టి20 ప్రపంచ కప్, 2011 తర్వాత వన్డే ప్రపంచ కప్ లను భారత్ నెగ్గలేదు. యూవీ, గంభీర్ స్థాయి ప్రదర్శనలు చేసే ఆటగాళ్లు లేకపోవడమూ దీనికి కారణం. కాగా, 2017 తర్వాత వీరిద్దరూ జాతీయ జట్టుకు దూరమయ్యారు. గంభీర్ 2019లో తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఆపైన కూడా క్రికెట్ తో అనుబంధం కొనసాగించారు. వ్యాఖ్యాతగా, ఐపీఎల్ జట్టు మెంటార్ గా బాధ్యతలు నిర్వర్తించారు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ లో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే, క్రికెట్‌ బాధ్యతల మధ్యన ఉన్నందున రాజకీయ విధుల నుంచి తప్పించమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరాడు. ఎంపీగా అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. "జై హింద్‌" అంటూ పోస్ట్ పెట్టాడు.

యూవీ అలా..

ఇక యూవీ పంజాబ్ కు చెందినవాడు. ఆ రాష్ట్రంలో అధికార ఆప్ ను ఢీకొట్టేందుకు బీజేపీ నానా పాట్లు పడుతోంది. ఈసారి ఆప్-కాంగ్రెస్ కలిసి ఇండియా కూటమి తరఫున అభ్యర్థులను నిలపనున్నాయి. దీంతో బీజేపీకి గట్టి అభ్యర్థులు కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ ను గురుదాస్ పూర్ ఎంపీగా నిలిపే ప్రయత్నం చేస్తోందని కథనాలు వచ్చాయి. కానీ, వీటిని యూవీ ఖండించాడు. కానీ, ప్రజలకు సహాయం చేయాలనే ఆసక్తి మాత్రం ఉందని చెప్పాడు. అది యూవీకెన్ ఫౌండేషన్ ద్వారా మాత్రమే అని ప్రకటించాడు. యూవీ 2011 వరల్డ్ కప్ తర్వాత కేన్సర్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ తర్వాత కోలుకుని అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాడు. 'యూవీకెన్ (నేను, మీరూ నెగ్గగలరు)' అంటూ తన ముద్దు పేరు కలిసొచ్చేలా ఫౌండేషన్ ను స్థాపించాడు.

Tags:    

Similar News