''పవన్ కళ్యాణ్ ఎవడు.. ఎక్కడ నుంచి వచ్చాడు?''
ప్రస్తుతం కరీంనగర్‌లో పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ నుంచి బండి సంజయ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు
ఎన్నికలంటే ఎన్నికలే.. తమకు తెలిసిన విషయాలు కూడా తెలియవని.. తాము చూసిన విషయాలు కూడా చూడలేదని.. కడు చక్కగా నొక్కి వక్కాణించి చెప్పగల ధీరులు మన నాయకులు. ప్రజలను నమ్మించడం.. తమవైపు తిప్పుకోవడమే పరమావధిగా నాయకులు వేసే అడుగులు.. చేసే ప్రసంగాలు కడు కమనీయమనే చెప్పాలి. తాజాగా ఈ విషయంలో ఆరితేరిపోయినట్టు వ్యవహరించారు బీఆర్ ఎస్ అమాత్యులు.. గంగుల కమలాకర్. ఆయన చేసిన ప్రసంగాలు.. కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
''కేఏ పాల్ ఎవడు..? సీఎం కేసీఆర్‌ను చంపుతా అంటున్నాడు. వాడిది అసలు ఏ ఊరు? పవన్ కళ్యాణ్ ఎవడు..? ఎక్కడి నుంచి వస్తున్నాడు? తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యను అన్న కిరణ్ కుమార్ తెలంగాణకు ఎందుకు వచ్చిండు'' .. ఇవీ.. మంత్రి గంగుల చేసిన హాట్ కామెంట్స్. అది కూడా గంభీరంగా! ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న(ఇక్కడ వరుస విజయాలు అందు కున్నాడు) మంత్రి గంగుల కమలాకర్.. తాజాగా రెచ్చిపోయారు.
ప్రస్తుతం కరీంనగర్‌లో పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ నుంచి బండి సంజయ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరో వైపు.. ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. దీంతో ఈ పోటీని తట్టుకుని గెలుపు గుర్రం ఎక్కాలం టే.. మరోసారి లోకల్ సెంటిమెంటును రాజేయడం.. నాయకులకు అవసరం అయింది. దీంతో గంగుల ఇప్పుడు ఇదే బాట పట్టారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు దొంగలని.. ఢిల్లీ గులాములని పేర్కొన్నారు. బండి సంజయ్ తన మీద మూడోసారి ఓడిపోతాడని చెప్పారు. 'గుండె పోటు' డ్రామాను నమ్మొద్దని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
అయితే.. కొసమెరుపు ఏంటంటే.. గంగుల పవన్ కళ్యాణ్ అబిమాని. ఆయనే గతంలో చెప్పాడు. ఇక, పాల్ విషయంలోనూ ఇంతే. పాల్ గొప్ప భక్తుడని వ్యాఖ్యానించారు. కానీ.. ఎన్నికల వేళ అంతా మరిచిపోయి.. అన్నీ వదిలేసి.. ఇప్పుడు వారెవరు.. ఎక్కడి నుంచి వచ్చారు..? ఏం చేస్తారు? అనే కామెంట్లు చేయడం గమనార్హం. మరి ఈ కామెంట్లను(డ్రామా అని ప్రతిపక్షాలు అంటున్నాయి) ప్రజలు ఏమేరకు విశ్వసిస్తారో చూడాలి.