గంగుల కమలాకర్ విజయ రహస్యం ఏమిటి?

కల్లోల జిల్లా కరీంనగర్. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా దీనికి పేరుంది. ఇక్కడ నుంచి గంగుల కమలాకర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు

Update: 2023-12-09 00:30 GMT

కల్లోల జిల్లా కరీంనగర్. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా దీనికి పేరుంది. ఇక్కడ నుంచి గంగుల కమలాకర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకే వ్యక్తికి నాలుగుసార్లు అధికారం ఇవ్వడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గంగుల కమలాకర్ మొదట కార్పొరేటర్ గా గెలిచారు. తరువాత ఎమ్మెల్యేగా నాలుగు మార్లు విజయం సాధించారు. మూడోసారి గెలిచాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

కరీంనగర్ లో మైనార్టీ ఓట్లే కీలకం. గెలుపు తీర్పు ఇచ్చే క్రమంలో వారి ఓట్లే ప్రధానంగా నిలుస్తున్నాయి. అందుకే గంగుల కమలాకర్ విజయం నల్లేరు మీద నడకలా మారింది. కానీ నాలుగోసారి మాత్రం సర్వే నివేదికలు గంగుల ఓడిపోతారనే వాదనలు వినిపించాయి. అనూహ్యంగా గంగుల విజయం అందరికి అంతుచిక్కలేదు. చివరి క్షణంలో స్వల్ప మెజార్టీతో గెలుపు ముంగిట నిలవడం విశేషం. కేవలం 3 వేల మెజార్టీతో చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు గెలిచారే కానీ పూర్తి మెజార్టీతో కాదని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో గంగుల భవితవ్యం ఖతం అనే ధోరణిలో ప్రచారం సాగింది. ఏ మాధ్యమం చూసినా గంగుల ఓడిపోతారనే చెప్పింది. దీంతో గంగుల గెలుపుపై అందరు అనుమానం వ్యక్తం చేసినా ఆయన మాత్రం అనూహ్యంగా ఓటమి అంచుల నుంచి బయటపడటం గమనార్హం. 35వ డివిజన్లోని మైనార్టీ ఓటర్లు గంగులకు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడైన సయ్యద్ గులాం హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

2009, 2014, 2018, 2023లో గంగుల కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తరువాత 2014లో బీఆర్ఎస్ లో చేరి 2018, 2023లలో కూడా ఎమ్మెల్యేగా తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. 2018లో గెలిచిన తరువాత బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2018,2023 లలో మూడుసార్లు బండి సంజయ్ గంగులపై ఓటమి పాలు కావడం గమనార్హం.

ఒకసారి బండి సంజయ్ ను అసెంబ్లీకి పంపాలనే సెంటిమెంట్ నెరవేరడం లేదు. నాలుగుసార్లు కూడా ఆయనను ఇంటికే పరిమితం చేశారు. 2019లో మాత్రం పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి ఢిల్లీ పంపారు. ఈనేపథ్యంలో బండి సంజయ్ ఎమ్మెల్యే కావాలనే కోరిక తీరకుండానే పోతోంది. గంగులకు మైనార్టీ ఓట్లే కీలకంగా మారి గెలుపు ప్రసాదం ఇస్తున్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News