గంగుల సైలెన్స్ వెనక మతలబేంటి ?!

బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి అంటే మరో 16 మంది ఎమ్మేల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది

Update: 2024-07-16 10:30 GMT

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం లక్ష్యంగా ముమ్మరంగా ఆపరేషన్ అకర్ష్ చేపట్టింది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా నెక్ట్స్ ఎవరు ? అన్న ఉత్కంఠ నెలకొంది.

బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి అంటే మరో 16 మంది ఎమ్మేల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అది జరిగితేనే ప్రస్తుతం పార్టీ మారిన వారు పార్టీ ఫిరాయింపు ఇబ్బందులు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సైలెంటుగా ఉన్నది ఎవరూ అని అందరూ గమనిస్తున్నారు.

కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఈ మధ్య కాలంలో నోరు మెదపడం లేదు. శాసనసభ ఎన్నికల్లో బండి సంజయ్ పై గంగుల 3163 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొంతకాలంగా సైలెంట్ అయ్యాడు. మంత్రిగా జిల్లాలో హల్ చల్ చేసిన గంగుల ఇటీవల జిల్లాకు చెందిన బీఅర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినా నోరు మెదపలేదు.

2009లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి 2014, 2018, 2023లో వరసగా ఎన్నికయ్యాడు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఆయన సైలెంట్ అయ్యాడని, ఇక మంత్రి పొన్నంతో ఉన్న విభేదాలు ఆయన మౌనానికి కారణం అని అంటున్నారు. ఎవరు ఎప్పుడు పార్టీని వీడతారో తెలియని ప్రస్తుత పరిస్థితిలో గంగుల మౌనం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తుంది.

Tags:    

Similar News