గంటా అన్ స్టాపబుల్ అంటున్నారు !
గంటా శ్రీనివాసరావు జన్మదినం ఒక పండుగగా చేయాలని చూస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ తెలుగుదేశం నాయకుడు గంటా శ్రీనివాసరావు పుట్టిన రోజు డిసెంబర్ 1న జరుగుతోంది. ఈ పుట్టిన రోజు వేడుకను అంగరంగ వైభవంగా అభిమానులు చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు జన్మదినం ఒక పండుగగా చేయాలని చూస్తున్నారు.
వాస్తవానికి అయితే గత ఏడాది గంటా పుట్టిన రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా జరిగింది. వచ్చే సారి మా నాయకుడు మినిస్టర్ అని నాడు అభిమానులు అంతా గట్టిగా ప్రకటించుకున్నారు. గంటా పవర్ ఫుల్ అని కూడా అన్నారు.
వారి మాటలలో సగమే నిజం అయింది. టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. గంటా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతానికి అదొక్కటే సంతోషంగా ఉంది అంటున్నారు. గంటాకు ఉన్న సీనియారిటీ ఆయనకు ఉన్న అర్ధబలం అంగబలం దృష్ట్యా ఆయన కచ్చితంగా మంత్రి అవుతారు అని లెక్కలు వేసుకున్నారు.
కానీ ఆయన జస్ట్ ఎమ్మెల్యేగానే కూటమి ప్రభుత్వంలో మిగిలిపోయారు. అయితే ఈ రోజుకీ ఆయన అభిమానులలో ఆశ ఉంది. ఏపీలో పెద్దది అయిన విశాఖ సిటీలో మంత్రి అయితే లేరు. గతంలో ఎపుడూ ఈ విధంగా జరగలేదు. దాంతో పాటుగా కేబినెట్ లో ఒక సీటు ఖాళీగా ఉంది.
అది గంటా కోసమే అని ఆయన అభిమానులలో నమ్మే వారూ అత్యధికంగా ఉన్నారు. అంతే గంటా పుట్టిన రోజు వేళ విశాఖ సిటీలో అంతటా పెట్టిన ఫ్లెక్సీలలో గంటా అన్ స్టాపబుల్ అని భారీగానే రాసుకొచ్చారు. మా నాయకుడు రాజకీయ పరుగు ఎక్కడా ఆగేది లేదు అది నిరంతరంగా సాగుతుంది అన్నది అభిమానులు అంటున్న మాట. ఇక విశాఖ జిల్లాకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా గంటా వంటి వారు కీలకమైన స్థానంలో ఉండాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే గంటాకు నామినేటెడ్ పదవులలో కూడా ఎక్కడా అవకాశం దక్కలేదు అన్న బాధ కూడా వారికి ఉంది. అయితే ఉందిలే మంచి కాలం అని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో గంటా బర్త్ డే వేడుకలను ఒక రేంజిలో నిర్వహించడం ద్వారా తామేంటో నిరూపించుకోవాలని అభిమానులు చూస్తున్నారు.
ఈ పుట్టిన రోజుతో ఆరున్నర పదులకు చేరువ అవుతున్న గంటా వయసు పెరుగుతున్నా పొలిటికల్ గా నాటౌట్ అనే అంటున్నారు. 1999లో తొలిసారిగా రాజకీయ అరంగేట్రం టీడీపీ నుంచి చేసిన ఆయన మొదటి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచి భారీ సక్సెస్ కొట్టారు
అది లగాయితూ ఇప్పటికి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఏడేళ్ళ పాటు మంత్రిగా వివిధ కీలక శాఖలను చూసారు. ఈసారి కనుక మరో చాన్స్ వస్తే మంత్రిగా పనిచేసి సంతృప్తిగా తన బాధ్యతలను వారసుడికి అప్పగించాలని అనుకుంటున్నారు అన్నది టాక్. మరి గంటా ఈ టెర్మ్ లో మంత్రి అవుతారా అన్నది చూడాల్సి ఉంది.