గంటా అండ్ సన్స్ : టీడీపీలో కొత్త కోటా !

గంటా అయితే మరోసారి పోటీకి సుముఖంగా లేరు. దాంతో తన సీటుని కుమారుడు రవితేజాకు అప్పగించి తాను మరో సేఫెస్ట్ ప్లేస్ ని చూసుకోవాలని అనుకుంటున్నారుట.

Update: 2023-10-11 17:31 GMT
గంటా అండ్ సన్స్ : టీడీపీలో కొత్త కోటా !
  • whatsapp icon

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తెలివైన రాజకీయ నాయకుడు అని అందరూ అంటారు. ఆయన ఏ పార్టీకి గాలి ఉందో ముందే పసిగడతారు. అంతే కాదు తన వర్గానికి టికెట్లు ఇప్పించుకోవడంలో నేర్పరి. ఏ పార్టీలో ఉన్నా తన గుర్తింపు పలుకుబడి ఎక్కడా వాడకుండా చూసుకునే టాలెంట్ ఆయన సొంతం అంటారు.

తన పొలిటికల్ కెరీర్ లో ఎందరికో టికెట్లు ఇప్పించి ఎమ్మెల్యేలను చేసిన చరిత్ర గంటాకు ఉంది. అలాంటి గంటా ఇపుడు సొంత ఇంటి నుంచి రెండవ టికెట్ కోరుకుంటున్నారు. అది ఎవరో కాదు తన కుమారుడు గంటా రవితేజా కోసం. ఇంతకీ గంటా రవితేజా ఎవరూ అంటే సామాన్యుడు కాదు, ఇద్దరు మాజీ మంత్రుల వారసుడు. మాజీ మంత్రి నారాయణకు స్వయాన అల్లుడు గంటా రవితేజా.

ఇక గంటా రవితేజాకు మొదట్లో సినిమాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది.దాంతో ఆయనని హీరోగా పెట్టి సినిమా నిర్మించారు గంటా. అది సరిగ్గా ఆడలేదు. దాంతో పాటు రవితేజాకు కూడా సినీ రంగం మీద ఇంటరెస్ట్ తగ్గి పాలిటిక్స్ వైపు మొగ్గు చూపారు 2019 నుంచి ఆయన తండ్రిని అనుసరిస్తూ వస్తున్నారు. ఇక రెండేళ్ళుగా ఆయన పుట్టిన రోజు వేడుకలు అన్నీ రాజకీయ హంగూ ఆర్భాటాలతోనే సాగుతున్నాయి.

గంటా సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఆయన పాలిటిక్స్ లోకి ఎలాంటి బ్యాక్ బ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. మంత్రిగా ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పాతికేళ్ళ రాజకీయ చరిత్రను సొంతం చేసుకున్నారు. ఇక చూస్తే ఆరున్నర పదుల వయసుకు చేరువ అవుతున్న గంటా 2024 ఎన్నికలను చివరి ఎన్నికలుగా భావిస్తున్నారు అని టాక్ నడుస్తోంది.

దాంతో తన రాజకీయ వారసుడిని తయారు చేసి తాను రేస్ లో ఉండగానే నిలబెట్టాలని చూస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన 2024 ఎన్నికల్లో అనుచరులు వర్గం టికెట్ల సంగతి పక్కన పెట్టి కేవలం తన ఫ్యామిలీకే రెండు టికెట్లు కోరుకుంటున్నారు అని అంటున్నారు. విశాఖ ఉత్తరం నుంచి గంటా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ టీడీపీకి క్యాడర్ గట్టిగా ఉంది కానీ లీడర్ల కొరత ఉంది.

గంటా అయితే మరోసారి పోటీకి సుముఖంగా లేరు. దాంతో తన సీటుని కుమారుడు రవితేజాకు అప్పగించి తాను మరో సేఫెస్ట్ ప్లేస్ ని చూసుకోవాలని అనుకుంటున్నారుట. భీమిలీ నుంచి అయినా లేక గాజువాక, అనకాపల్లి అయినా చోడవరం అయినా పోటీకి గంటా ప్రిపేర్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. తన కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తే టీడీపీకి విశాఖ జిల్లాలో అన్ని రకాలుగా తాను అండగా ఉంటూ మొత్తం సీట్లు గెలిపించుకుని వస్తాను అని గంటా చెబుతున్నారుట.

ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. దాంతో గత నెల రోజులుగా చంద్రబాబు విడుదల కావాలంటూ గంటా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నాలుగేళ్ళుగా ముఖం చూడని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. పార్టీ క్యాడర్ ని వెంటబెట్టుకుని రోజుకు రెండూ నుంచి మూడు కార్యక్రమాలను వరసగా నిర్వహిస్తున్నారు.

దీంతో గంటా జోరు చూసిన వారు ఆయన పక్కా ప్లాన్ మీద ఉన్నారని అంటున్నారు. అయితే నాలుగేళ్ళుగా పార్టీ కోసం పనిచేయని గంటాకు రెండు టికెట్లు ఎలా ఇస్తారు అన్నది సొంత పార్టీ నుంచే ఉంది. ఇక విశాఖలో గంటా పోటీ చేసేందుకు అసెంబ్లీ సీట్లు ఏవీ లేవని, ఈసారికి ఆయనను ఒంగోలు ఎంపీగా పంపుతారు అని కూడా అంటున్నారు. అలాగే ఒక కుటుంబానికి ఒక టికెట్ అని కూడా కొందరు కొత్త రూల్స్ తెస్తున్నారు.

అయితే గంటా చాణక్యం చూసిన వారు ఆయన ఇపుడు పట్టుబడుతున్నది కొడుకు కోసం కూడా కావడంతో తప్పకుండా రెండు సీట్లు సాధించడమే కాదు గెలుచుకుని తీరుతారు అని అంటున్నారు. గంటా విమర్శలు ఎవరు చేసినా పెదవి విప్పరు. తన పని తాను చేసుకుని పోతారు. ఇపుడు కూడా ఆయన బాబు వద్ద తనకు తగిన భరోసా ఉంది కాబట్టే కొడుకుని రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారు అని అంటున్నారు.

మరి గంటాకు రెండు టికెట్లు దక్కుతాయా ఆయనకే రెండు టికెట్లు ఇస్తే సొంత పార్టీలో ఆయన ప్రత్యర్ధి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చూస్తూ ఊరుకుంటారా. తనకి తన కుమారుడు విజయ్ పాత్రుడికి రెండు టికెట్లు అని పేచీ పెట్టకుండా ఉంటారా మరో వైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తన కొడుకుని కూడా ముందుకు తెస్తారు అని అంటున్నారు. మరి గంటా ప్లాన్స్ ఏంటి అన్నది తెలియాలంటే వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News