ప్రభుత్వ పథకాలపై గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రధానంగా భారతదేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రకటించే ఉచిత పథకాలపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
ప్రధానంగా భారతదేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రకటించే ఉచిత పథకాలపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత పథకాలతో ప్రజలను బద్ధకస్తులను చేస్తున్నారని కొందరంటే... ఆ ఉచితాల విలువ ఎవరికి తెలియాలో వారికే తెలుస్తుందని, కడుపు నిండిన వాడికి తెలియదని మరికొందరు అంటుంటారు. ఈ సమయంలో తాజాగా ప్రభుత్వాల ఉచిత పథాకాలపై గరికపాటి నరసింహారావు స్పందించారు.
అవును... తాజాగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు.. ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలపై స్పందించారు. ఇందులో భాగంగా ఆ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉచిత పథకాలతో ప్రజల తలరాతలు మారవని, వీటితో ప్రభుత్వాలు కూడా బాగుపడవని గరికపాటి నరసింహారావు చెప్పుకొచ్చారు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో గంగా భ్రమరాంబ సమేత చంద్రశేఖరస్వామి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచితాలు క్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయని, వాటిని అరికట్టాలని అన్నారు. ఇదే సమయంలో... ప్రజలు చైతన్యంతో ముందుకు వెళ్లాలని, ఎన్నికల సమయంలో మంచి వ్యక్తికి ఓటు వేయాలని సూచించారు.
ఇక... ఇక విదేశాలలో ఉన్న వారు అక్కడ బాగా డబ్బులు సంపాదించిన తర్వాత స్వదేశాలకు వచ్చి స్థిరపడాలని, తల్లిదండ్రులకు సేవ చేయాలని గరికపాటి నరసింహారావు ఆకాంక్షించారు.
కాగా ఇటీవల కాలంలో ఉచిత పథకాలు అనేవి ప్రతీ రాజకీయ పార్టీ ప్రధానంగా ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అమలు చేస్తున్న ఉచిత పథకాలపై విమర్శలు చేస్తూనే... తాము అధికారంలోకి వస్తే వీటిని కంటిన్యూ చేస్తూ, మరింత ఎక్కువగా ఇస్తామని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు చెబుతున్న సంగతి తెలిసిందే.