మహా కుంభమేళాలో అదానీ... కుమారుడి వివాహంపై కీలక ప్రకటన!

ఆయన చిన్న కుమారుడు జిత్ అదానీ - దివా జైమిన్ షా ల వివాహానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు గౌతమ్ అదానీ.

Update: 2025-01-21 15:30 GMT

ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇందులో భాగంగా... ఆయన చిన్న కుమారుడు జిత్ అదానీ - దివా జైమిన్ షా ల వివాహానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు గౌతమ్ అదానీ. ఇందులో భాగంగా... ఫిబ్రవరి 7వ తేదీన జిత్ అదానీ వివాహం జరగనుందని వెల్లడించారు.

అవును... ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ పర్యటనలో ఉన్న అదానీ.. ఇస్కాన్ పండల్ లో భండర సేవ నిర్వహించి, అనంతరం త్రివేణీ సంగమంలో పూజలు చేసిన తర్వాత ప్రసిద్ధ బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఇంట జరగబోయే వివాహ వేడుకల విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... ఫిబ్రవరి 7వ తేదీన జిత్ వివాహం జరగనుందని తెలిపారు. ఈ సమయంలో స్పందించిన ఆయన.. తమ ఇంట కార్యక్రమాలు సామాన్యులలాగే ఉంటాయని, అదేవిధంగా జిత్ వివాహం కూడా చాలా సింపుల్ గా, సంప్రదాయ పద్ధతిలోనే జరుగుతుందని అన్నారు.

కాగా... గత 2023 మార్చిలో ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా తో అదానీ చిన్న కుమారుడు జిత్ కు నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. నాడు ఈ వేడుక కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా జరిగిందని చెబుతారు.

ఇస్కాన్ లో భోజనం వండిన అదానీ!:

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు గౌతమ్ అదానీ, ప్రీతీ అదానీ. ఈ సందర్భంగా వీరిరువురూ త్రివేణీ సంగమం వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం ఇస్తాన్ క్యాంపును సందర్శించారు. ఈ సమయంలో మహాప్రసాద మండపంలో భోజనం తయారు చేయడంలో సహాయం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతుంది.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... మహా కుంభమేళాకు రావడంతో పాటు ఇస్కాన్ మహా ప్రసాద్ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులకు ఉచిత ఆహారం అదించడం గొప్ప కార్యక్రమం అని ఇస్కాన్ ను కొనియాడుతూ.. కృతజ్ఞతలు తెలిపారు.

పాప్ క్వీన్ టేలర్ స్విఫ్ట్ ప్రదర్శనపై చర్చ!:

జిత్ అదానీ వివాహ వేడుకల్లో భాగంగా జరిగే ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ లో పాప్ క్వీన్ టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన ఉండే అవకాశాలున్నాయనే చర్చ వీరి నిశ్చితార్ధం సమయం నుంచే మొదలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో గ్లోబల్ పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ తో అదానీ టీమ్ చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.

ఇది కన్ ఫాం అయ్యి.. అధికారిక ప్రకటన వెలువడితే.. భారతదేశంలో టేలర్ స్విఫ్ట్ మొదటి ప్రదర్శనగా ఈ వేడుక నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న స్విఫ్ట్.. భారత్ లో ఎప్పుడూ ప్రదర్శనలు ఇవ్వలేదు. దీంతో... జిత్ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ లో ఆ అవకాశం ఉండొచ్చని అంటున్నారు.

Tags:    

Similar News