గౌతమ్ అదానీ లైఫ్ లో టన్నుల కొద్దీ.. సినిమాటిక్ సీన్లు.. తెలిస్తే చెమటలే!
కొన్ని సందర్భాల్లో ఏజెన్సీకి సైతం అంతు పట్టని రీతిలో రియాక్టు అవుతారు.
జేమ్స్ బాండ్ పాత్రను అపర కుబేరుడు కం అత్యంత వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీకి ముడి పెడతారా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. ఆయన జీవితాన్ని తరచి చూస్తే.. ఆయనలో కార్పొరేట్ జేమ్స్ బాండ్ కనిపిస్తాడు. హాలీవుడ్ బాండ్ క్యారెక్టర్ ను తీసుకోండి.. లోక కల్యాణం కోసం అమెరికా ఏజెన్సీ కింద పని చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఏజెన్సీకి సైతం అంతు పట్టని రీతిలో రియాక్టు అవుతారు. కొందరికి విలన్ గా ఎందరికో హీరోగా కనిపించే జేమ్స్ బాండ్ మాదిరే గౌతమ్ అదానీని సైతం ఆకాశానికి ఎత్తేసే వారే కాదు.. ఆయన పాతాళంలోకి జారితే చూడాలని తపించేటోళ్లకు కొదవ లేదు.
జేమ్స్ బాండ్ మాదిరే.. గౌతమ్ అదానీ సైతం నిత్యం ఏదో ఒక సాహసం చేస్తూనే ఉంటారు. ఒకటి తర్వాత మరొకటి చొప్పున భారీ సవాళ్లు అతనికి ఎదురవుతూ ఉంటాయి. కార్పొరేట్ జీవితంలోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ ఆయనకు ఎదురైన భయంకర అనుభవాల గురించి తెలిస్తే.. భయంతో ఒళ్లు వణకాల్సిందే.62 ఏళ్ల ఈ భారతీయ కార్పొరేట్ దిగ్గజం తాజాగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. వణికించే సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో.. సవాళ్లకు సవాలుగా ఎలా మారాలో ఆయన్ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా.. ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో పలు మార్లు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ అదానీ.. తాజాగా అమెరికాలోని ఫెడరల్ కోర్టు నేరారోపణలు చేయటం.. ఇదంతా భారీ ప్రకంపనల్ని క్రియేట్ చేయటం తెలిసిందే. స్టాక్ మార్కెట్ లోనూ అదానీ షేర్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఈ సందర్భంగా అదానీ ఛైర్మన్ గౌతమ్ అదానీ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఎదురైన సంక్షోభాలు.. వాటిని ఎదుర్కొనే విధానం సినిమాటిక్ ను తలపిస్తాయి.
అపర కుబేరుడిగా అందరికి సుపరిచితమైన గౌతమ్ అదానీ స్కూలింగ్ కూడా పూర్తి చేయలేదని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గుజరాత్ లోని అహ్మబాద్ కు చెందిన ఒక జైన్ కుటుంబంలో ఎనిమిది మంది సంతానంలో ఏడోవాడు గౌతమ్ అదానీ. ఆయన తండ్రి జౌళి వ్యాపారం చేసేశారు. తన పదహారేళ్ల వయసులో ముంబయికి వచ్చిన గౌతమ్ అదానీ.. ఒక రత్నాల వ్యాపారి వద్ద వజ్రాల సార్టర్ గా పని చేవారు. 1981లో గుజరాత్ కు తిరిగి వెళ్లి.. తన సోదరుడుతో కలిసి ఒక చిన్న పీవీసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ నడిపారు. 1988లో అదానీ ఎక్స్ పోర్ట్స్ పేరుతో ఒక కమోడిటీ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేసిన ఆయన 1994లో స్టాక్ ఎక్స్ఛేంజీలో తన సంస్థను నమోదు చేశారు. అదే ఇప్పటి అదానీ ఎంటర్ ప్రైజస్.
ఎగుమతుల సంస్థ ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే బిజినెస్ లో సక్సెస్ చూడటం షురూ చేశారు. 1998 జనవరి 1న అదానీ.. ఆయన వ్యాపార భాగస్వామి శాంతీలాలా పటేల్ కు గన్ చూపించి కిడ్నాప్ చేశారు. రోజు తర్వాత వారిని విడిచిపెట్టారు. అయితే.. భారీగా డబ్బులు చేతులు మారినట్లు చెప్పినా.. ఆ వివరాలు బయటకు రాలేదు. ఆ కిడ్నాప్ ను గ్యాంగ్ స్టర్లు ఫజ్లు రెహమాన్.. భోగిలాల్ దర్జీ చేసినట్లుగా చెబుతారు. ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకోవటం గౌతమ్ అదానీ జీవితంలో కనిపిస్తుంది.
ముంబయి ఉగ్ర దాడుల వేళ ఆయన తాజ్ హోటల్ లో ఉన్నారు. దుబాయ్ పోర్ట్ సీఈవో మహమ్మద్ షరాఫ్ తో కలిసి రెస్టారెంట్ లో ఉన్న వేళ.. డబ్బులు కట్టి బయటకు వెళ్లే వేళలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఫుడ్ తిన్న తర్వాత కాఫీ కోసం కొంతమంది పార్టనర్లు ఆపటంతో ఆయన బతికిపోయినట్లుగా చెబుతారు. ఉగ్రదాడి నేపథ్యంలో అదానీ.. ఇతర అతిధులను హోటల్ లోని కిచెన్.. తర్వాత బేస్ మెంట్ కు హోటల్ సిబ్బంది తరలించారు. రాత్రంతాఅక్కడే ఉన్న తర్వాత తర్వాతి రోజు ఉదయం కమాండోలు వారిని రక్షించారు.
ఒకవేళ కాఫీ కోసం ఆగకుండా.. డబ్బులు కట్టేసి రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి ఉంటే.. ఉగ్రవాదుల తూటాలకు బలై ఉండేవాడినన్న మాట అదానీ చెప్పటం కనిపిస్తుంది. మరో సందర్భంలో అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రైవేటు జెట్ లో వెళ్లిన సందర్భంలోపూ 15 అడుగుల దూరంలో మ్రత్యువును తాను చూసినట్లుగా చెప్పుకున్నారు. 1988లో కమొడిటీస్ ట్రేడర్ గా మొదలైన అదానీ ప్రస్థానం.. గుజరాత్ లోని ముంద్రా పోర్టును నిర్వహించే వరకు వెళ్లారు. అంతేకాదు దేశంలో అతి పెద్ద పోర్టు ఆపరేటర్ గా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.
ఆ వ్యాపారం ఈ వ్యాపారం అన్నది లేకుండా ప్రతి రంగంలోనూ ఎంటర్ కావటం.. తన వ్యాపారాన్ని విస్తరించటం గౌతమ్ అదానీకి అలవాటు. తాజాగా సిమెంట్.. మీడియా వ్యాపారంలోకి అడుగు పెట్టిన అదానీ మీద ఉన్న పెద్ద ఆరోపణ.. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ అండ కొండంత అని. అయిగే.. మోడీ సీఎంగా ఉన్నప్పుడు కానీ పీఎంగా ఉన్నప్పుడు కానీ తాను ఎలాంటి సాయాన్ని పొందలేదని చెప్పుకోవటం కనిపిస్తుంది.
ఆస్తుల విషయంలో భారత కుబేరుడు ముకేశ్ అంబానీని దాటేసిన గౌతమ్ అదానీ.. ఒకదశలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను దాటేసి.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు కూడా. కాకుంటే.. ఇటీవల ఆయనకు ఎదురవుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచంలో 25వ అత్యంత సంపన్నుడి స్థానంలో ఉన్నారు. ఆయన తన వ్యాపారాల్ని విస్తరించుకోవటంలో భాగంగా పెద్ద వివాదాలకు దిగేందుకు వెనుకాడరు. ఎవరైనా సరే.. తనతో పోరాడి.. పోరాడి అలిసిపోవాల్సిందే తప్పించి.. తాను అలిసిపోయి వెనక్కి తగ్గే తీరు గౌతమ్ అదానీలో కనిపించలేదు ఇప్పటివరకు. తాజా పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చూడాలి.