గ్యాంగ్‌ రేప్‌ తో గర్భం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

గ్యాంగ్‌ రేప్‌ కారణంగా గర్భం దాల్చిన ఒక మహిళపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది

Update: 2023-08-21 09:59 GMT

గ్యాంగ్‌ రేప్‌ కారణంగా గర్భం దాల్చిన ఒక మహిళపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. గర్భవిచ్చిత్తి కోసం ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంగా కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

వివాహ వ్యవస్థ ద్వారా ప్రతి మహిళ తల్లి అయితే ఎంతో వారు సంతోషిస్తారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే వివాహం ద్వారా కాకుండా సామూహిక లైంగిక దాడి కారణంగా గర్భం దాలిస్తే అది ఆ మహిళలకు కోలుకోలేని గాయమవుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఈ పరిస్థితి ఆ మహిళ తీవ్ర మనోవేదనకు కారణమవుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ గర్భవిచ్చిత్తి చేయించుకోవడానికి కోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం బాధిత మహిళ 27 వారాల గర్భంతో ఉంది.

భారత వివాహ వ్యవస్థలో వివాహిత తల్లి అయితే భార్యాభర్తలకే కాకుండా వారి కుటుంబ సభ్యులందరికీ అది సంతోషకర వార్తవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే వివాహం కాకుండా ఒక మహిళ తల్లి అయితే అది ఆమె జీవితానికి హానికరంగా మారుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. సంఘంలో ఆమె పేరుకు, వారి కుటుంబ సభ్యులకు ఇది తీరని గాయని చేస్తుందని తెలిపింది. ముఖ్యంగా అత్యాచారం కారణంగా గర్భం రావడం బాధిత మహిళను, ఆమె కుటుంబాన్ని తీవ్రంగా బాధపడుతుందని కోర్టు వెల్లడించింది. ఈ ఘటన బాధిత మహిళ శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం బాధిత మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

గర్భవిచ్చిత్తి చేసేటప్పుడు ఆ పిండం సజీవంగా ఉంటే దాన్ని ఇంక్యుబేటర్‌ లో ఉంచి సంరక్షించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ చిన్నారిని ప్రభుత్వం సంరక్షించాలని ఆదేశించింది. అలాగే బాధిత మహిళకు అండగా ఉండాలని సూచించింది. ఈ సందర్భంగా బాధిత మహిళ కేసులో గుజరాత్‌ హైకోర్టు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసులో బాధిత మహిళ గర్భ విచ్ఛిత్తికి గుజరాత్‌ హైకోర్టు అనుమతించకపోవడం సరికాదని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బాధిత మహిళ ఆవేదన, వైద్య రిపోర్టులను పరిగణనలోకి తీసుకుని ఆమె తన 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఇందుకు ఆమె వెంటనే ఆస్పత్రిలో చేరొచ్చని తెలిపింది.

కాగా బాధిత మహిళ తొలుత తన గర్భాన్ని తీసివేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఆగస్టు 7న గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 8న హైకోర్టు విచారణకు స్వీకరించి.. వైద్య నివేదికకు ఆదేశించింది. ఈ క్రమంలో 10న నివేదిక వచ్చింది. 11న నివేదిక అందినట్లు ధ్రువీకరించి కేసును 12 రోజులకు అంటే ఆగస్టు 23కు హైకోర్టు వాయిదా వేసింది. దీంతో బాధితురాలు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. గుజరాత్‌ హైకోర్టు తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాధిత మహిళ కేసు పెండింగులో పెట్టదగినది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనివల్ల పిండం మరింత పెరుగుతుందని.. మహిళ ఆరోగ్య పరిస్థితిలో మార్పులు రావచ్చని పేర్కొంది. ఈ పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టడం ద్వారా విలువైన సమయం వృథా అయిందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

అయితే ఈ లోగానే..∙శనివారం గుజరాత్‌ హైకోర్టు విచారణ జరిపి మహిళ పిటిషన్‌ ను కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది. గుజరాత్‌ హైకోర్టులో ఏం జరుగుతోంది..? అని ప్రశ్నించింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులకు వ్యతిరేకంగా దేశంలో ఏ కోర్టూ తీర్పులు ఇవ్వకూడదనే విషయం కూడా తెలియదా అని ఘాటుగా స్పందించింది. ఇది రాజ్యాంగ తత్వానికి విరుద్ధం అని వ్యాఖ్యానించింది. మహిళ గర్భవిచ్చిత్తి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

Tags:    

Similar News