కొత్త ఏడాదిలో బంగారం భవిష్యత్తు ఏమిటి?
కారణాలు ఏమైనా కావొచ్చు.. దూసుకెళ్లటమే తప్పించి.. వెనక్కి తగ్గటమే ఉండని ఆభరణంగా బంగారం నిలుస్తుంది.
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడేది.. సొంతం చేసుకోవటానికి తెగ కష్టపడేది ఏమైనా ఉందంటే.. ఆ జాబితాలో బంగారం మొదటి స్థానంలో నిలుస్తుంది. అంతకంతకూ పెరిగిపోతున్న బంగారం ధర 2023లో కొత్త మార్కుకు చేరుకోవటం తెలిసిందే. గడిచిన సంవత్సరాన్ని పక్కన పెడితే..కొత్త ఏడాదిలో ఏం కానుంది? ఎంతమేర పసిడి పరుగు తీయనుందన్నది ఆసక్తికరం. బంగారంలో పెట్టుబడి పెట్టినోళ్లకు 2023 23 శాతం వరకు ప్రతిఫలాన్ని అందించింది. మరి..కొత్త ఏడాదిలో ఎలా ఉండనుంది? పది గ్రాముల బంగారం ధర ఎంతమేరకు చేరనుంది? అన్న అంశాలపై నిపుణులు ఏమంటున్నారు? అన్నది చూస్తే..
కారణాలు ఏమైనా కావొచ్చు.. దూసుకెళ్లటమే తప్పించి.. వెనక్కి తగ్గటమే ఉండని ఆభరణంగా బంగారం నిలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పది గ్రాముల బంగారం కొత్త ఏడాదిలో రూ.85 వేల మార్క్ కు చేరుకుంటుందని చెబుతున్నారు. ఒకవేళ రూ.90 వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట. ప్రస్తుతం దేశీయ మార్కెట్ లో పది గ్రాముల పసిడి ధర రూ.79,350 వద్ద కొనసాగుతోంది. మల్టీ కమొడిటీ ఎక్ఛ్సేంజీలో రూ.76,600 వద్ద ట్రేడ్ అవుతోంది. 2024లో బంగారం మీద పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాల్ని మిగిల్చింది. ఒక దశలో పది గ్రాముల బంగారం రూ.82,400 వరకు వెళ్లటం తెలిసిందే. ఇది ఆల్ టైం గరిష్ఠంగా చెప్పాలి.
బంగారం మాదిరే వెండి సైతం అనూహ్య వ్రద్ధిని నమోదు చేసింది. 2024లో తొలిసారి కిలో వెండి లక్ష రూపాయిల మార్కును దాటింది. అంతర్జాతీయ మార్కెట్ లో 2024 ప్రారంభంలో ఔన్సు బంగారం (31 గ్రాములు) 2062 డాలర్లు ఉండగా.. ఒక దశలో 2790 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం 2600 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. నిపుణుల అంచనాల ప్రకారం కొత్త ఏడాదిలోనూ బంగారం మెరుగైన రాబడిని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. 2024తో పోలిస్తే.. ఇప్పుడున్న భౌగోళిక అనిశ్చితులు ఇదే రీతిలో కొనసాగితే బంగారం ధర దేశీయంగా రూ.85 వేలకు చేరుకుంటుందని చెబుతున్నారు. అమెరికా ఫెడ్ అనుసరిస్తున్న విధానంతో బంగారం ధరలు పెరిగేందుకు వీలుందని యెబుతున్నారు.
రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్దం.. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలపై ప్రభావాన్ని చూపాయి. ఇలాంటి భౌగోళిక ఉద్రిక్తతల వేళ బంగారం ధరలు 2-3 శాతం మేర పెరగటం మామూలే. మరోవైపు ట్రంప్ రెండోసారి ఎన్నికైన వేళ.. క్రిప్టో కరెన్సీ పరుగులు తీస్తోంది దీనికి తోడు బాండ్ల రాబడులు పెరగటంతో కొందరు మదుపరులు బంగారానికి దూరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. బంగారం జోరు అంచనాలకు కాస్త తక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని మోడీ సర్కారు 6 శాతం మేర తగ్గించటంతో పది గ్రాముల బంగారం మీద రూ.5 వేల మేర తగ్గింది. అదే సమయంలో బ్రాండెడ్ జ్యూయలరీ మీద పెరిగిన ఆదరణ కారణంగా బంగారం జోరుకు ఢోకా ఉండదన్న మాట వినిపిస్తోంది.