కిర్గిస్తాన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు గుడ్ న్యూస్!
ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ విద్యార్థులపై స్థానికులు తీవ్ర దాడులు చేశారు.
కిర్గిస్తాన్ దేశంలోని రాజధాని నగరం బిషెక్ లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఒక మూక హింసకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న ఓ హాస్టల్ లో చెలరేగిన చిన్న ఘర్షణ కాస్తా స్థానికులు వర్సెస్ విదేశీయులుగా మారిన పరిస్థితి. ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ విద్యార్థులపై స్థానికులు తీవ్ర దాడులు చేశారు.
ఈ దాడుల్లో పలువురు పాకిస్తానీ విద్యార్థులు మరణించగా.. భారతీయ విద్యార్థులూ తీవ్ర ఆందోళన వ్యక్తపరిచినట్లు కథనాలొచ్చాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సొసైటీ తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా అక్కడున్న తెలుగు విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వారికి కౌన్సెలింగ్ ఇస్తోందని అంటున్నారు.
ఈ సమయంలో ఏపీఎన్ఆర్టీఎస్ తమకు తెలిసిన, సేకరించిన సమాచారాన్ని.. విదేశాంగ శాఖ ఇస్తున్న సలహాలను అక్కడి విద్యార్థులకు చేరవేస్తోందని అంటున్నారు. తమ ప్రయత్నాలకు కొనసాగింపుగా కిర్గిస్థాన్ లో ఏపీ విద్యార్థుల భద్రత, శ్రేయస్సు, ప్రస్తుత పరిస్థితి, విద్యార్థుల సమస్యల గురించి కేంద్రానికి వివరించినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో భారత వైద్య విద్యార్థులు దేశానికి తిరిగి రావడానికి ముందు, నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. విద్యార్థులు భారతదేశానికి తిరిగి రావాలి అనుకుంటే మే 23 నుంచి బిష్కెక్ టు న్యూఢిల్లీకి నేరుగా ప్రతిరోజూ 2 విమానాలు నడుస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలోనే కిర్గిస్థాన్ లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడవద్దని సూచించారు అధికారులు! కాకపోతే... అప్రమత్తంగా ఉండాలని, ఎంబసీ సూచించిన సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని ఏపీఎన్ఆర్టీఎస్ విజ్ఞప్తి చేసింది. కిర్గిస్థాన్ లోని ఏపీ విద్యార్థులు సహాయం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ నంబర్లు +91 863 2340678; +91 85000 27678 (వాట్సాప్) 24 గంటలు అందుబాటులో ఉంటాయని సూచించారు.
అదేవిధంగా... ఏదైనా అత్యవసర సహాయం కోసం, భారతీయ/తెలుగు విద్యార్థులు బిష్కెక్ లోని భారత రాయబార కార్యాలయంను 0555710041 హెల్ప్ లైన్ నంబర్లో సంప్రదించాలని ఎంబసీ అధికారులు తెలిపారు.