ఓడిపోతే బలవన్మరణమే... కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ నెక్స్ట్ స్టెప్!

అవును... హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు.

Update: 2024-01-25 07:54 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గతేడాది నవంబర్ 28న భార్య, కుమార్తెతో కలిసి పాల్గొన్న పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారమే రేగింది. ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్స్ నేత పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గవర్నర్ తమిళసై స్పందించారు. ఇందులో భాగంగా ఆ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు.

అవును... హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఇందులో భాగంగా పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కి సూచించారు. తాజాగా జేఎన్టీయూలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేసున్న సమయంలో... తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి.. తనను గెలిపించడం వల్ల ప్రజలకు ఏమి ప్రయోజనం అనేది వివరించి గెలవాలని, అలాకాకుండా కెమెరా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసి బెదిరించి ఓట్లు అడగడం సరికాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ సమయంలోనే... అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు.

కాగా... ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆరెస్స్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా... తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడతా అంటూ కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పక్కనే భార్య, కుమార్తె కూడా ఉన్నారు.

దీంతో... ఆ సమయంలోనే ఎన్నికల కమిషన్ కు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదులు వెళ్లాయి! దీంతో స్పందించిన ఈసీ కౌశిక్ రెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా గవర్నర్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించారు.

కాగా తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన త్రిముఖ పోరులో... బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి 16,873 ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఈటెల కు 63,460 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ కు 53,164 ఓట్లు పోలయ్యాయి. ఇక బీఆరెస్స్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి 80,333 ఓట్లు వచ్చాయి!


Tags:    

Similar News