తొలి ప్రసంగంతోనే.. తెలంగాణ సమాజానికి విందు చేశారే!
తెలంగాణ ముఖ్యమంత్రి మార్పుతో తమకు సంపూర్ణమైన మార్పు కనిపిస్తుందని ఆశించిన తెలంగాణ సమాజం అంచనాలను నిజం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడుగులు ప్రారంభించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి మార్పుతో తమకు సంపూర్ణమైన మార్పు కనిపిస్తుందని ఆశించిన తెలంగాణ సమాజం అంచనాలను నిజం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడుగులు ప్రారంభించింది. నిజానికి సీఎంగా పగ్గాలు చేపడుతూనే.. ప్రగతి బవన్‌ను ప్రజాభవన్‌గా మార్చడం.. ఎలాంటి భేషజాలకు పోకుండా .. రాజకీయాలకు తావు లేకుండా.. ఆసుపత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను పలకించడం.. ఆవెంటనే ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునే ప్రజావాణికి ఊపిరిలూదడం.. వంటివి రేవంత్ వేసిన అడ్డుగుల్లో కీలకమైనవని అంటున్నారు.
ఇక, ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ద్వారా.. తాను చేయాలనుకున్న అన్ని కార్యక్రమాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ సమాజానికి చెప్పకనే చెప్పేసింది. ధరణి నుంచి కీలకమైన, ఎన్నికలకు ముందు అత్యంత వివాదాస్పదమైన రైతులకు 24 గంటల విద్యుత్ వరకు.. ఉద్యోగాల కల్పన నుంచి ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టుకునే వారికి సాయం.. దాకా.. అన్నీ గుదిగుచ్చి.. ఆరు గ్యారెంటీల మసాలా కలిపి.. గవర్నర్ తెలంగాణ సమాజానికి విందు చేశారు.
ప్రధానంగా ఇళ్ల నిర్మాణం అనగానే.. ఏ ప్రభుత్వమైనా.. హామీ అయితే.. ఇస్తుంది. కానీ, అమలు మాత్రం ఎన్నికలకు రెండేళ్ల ముందు ప్రారంభిస్తుంది. దీనిని మరోసారి రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది రోజులు కూడా నిండకుండానే.. ఇళ్లకు సంబంధించి కూడా కీలక ప్రకటన చేసేసింది. ఇళ్లు కట్టుకునేవారికి రూ.5 లక్షల సాయం చేస్తామని, ఎస్సీ , ఎస్టీలైతే.. 6 - 7 లక్షలు ఇస్తామని గవర్నర్ ప్రకటించారు.
మరోవైపు.. అవినీతి విషయంపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలకు ముందు తీవ్ర వివాదం అయితే.. కీలక ప్రాజెక్టులు కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డల ప్రాజెక్టుల అవినీతిపైనా దర్యాప్తు చేయనున్నట్టు ప్రభుత్వం చెప్పడం ద్వారా.. తాము అభివృద్ధి, సంక్షేమంలోనే కాదు.. తెలంగాణ సమాజానికి చెందిన ప్రతి రూపాయికీ జవాబుదారీగా ఉంటామని స్పష్టం చేసినట్టయింది. నిజానికి ఇవన్నీ.. చెప్పకపోయినా.. ఇంకా సమయం ఉందని సర్దు కోవచ్చు. కానీ, రేవంత్ సర్కారు.. అలా చేయకుండా.. ఆది నుంచి వేస్తున్న దూకుడు అడుగులనే కొనసాగించడం తెలంగాణ సమాజాన్ని మెరిపిస్తోందనే చెప్పారు.