తూత్తుకుడి ఎంపీగా తెలంగాణ గవర్నర్... క్లారిటీ వచ్చేసింది!

ఈ సమయంలో గవర్నర్ కు సంబంధించి ఒక కీలక విషయం హల్ చల్ చేస్తుంది.

Update: 2023-12-30 12:38 GMT

తెలంగాణ రాష్ట్రంలో పలు సంచలనాలు సృష్టించిన గవర్నర్... నాడు బీఆరెస్స్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై సంచలనాత్మకంగా రియాక్ట్ అయ్యారు. ఒకానొక దశలో బీఆరెస్స్ ప్రభుత్వం వర్సెస్ తెలంగాణ గవర్నర్ అనే స్థాయిలో మీడియాలో వార్తలు నడిచేవి! ఈ సమయంలో తెలంగాణలో తాజాగా కొత్త ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో గవర్నర్ కు సంబంధించి ఒక కీలక విషయం హల్ చల్ చేస్తుంది.

అవును... తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆమె తన సొంతరాష్ట్రమైన తమిళనాడులోని తూత్తుకుడి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కథనాలొచ్చాయి.

ఇదే సమయంలో ఆమె ప్రతిపాదనకు బీజేపీ అధిష్టానం అంగీకరిస్తే.. ఇటు తెలంగాణ గవర్నర్, అటు పుదుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ పదవుల నుంచి తప్పుకునేందుకు సిద్ధపడుతున్నారని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీంతో ఈ ఊహాగాణాలపై గవర్నర్ తమిళ సై తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శనివారం సికింద్రాబాద్ బోయిన్‌ పల్లిలోని అయోధ్య రామాలయ ద్వారాలు తయారు చేసిన అనురాధ టింబర్ డిపోను సందర్శించిన గవర్నర్ తమిళిసై... అనంతరం తన పదవికి రాజీనామా చేసి, ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఇందులో భాగంగా ఆ కథనాలను ఖండించారు. అదంతా కేవలం ప్రచారం అని... తాను తెలంగాణలోనే ఉంటానని, ప్రజలతో ఉండడానికి ఇష్టపడతానని అన్నారు.

ఇదే సమయంలో ఎంపీగా పోటీచేసేందుకు తాను ఢిల్లీకి ఎటువంటి రిక్వెస్ట్ లు పెట్టుకోలేదని ఆమె ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తనకు బీజేపీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, శ్రీ రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

ఇదే సమయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూత్తుకుడిలో వరదలు రావడంతో అక్కడ పర్యటించానని చెప్పిన తమిళసై... అంతకు మించి మరో కారణం లేదని స్పష్టం చేశారు. ఇక... అయోధ్య రామాలయ ద్వారాల తయారీ పరిశ్రమకు రావడం ఆనందంగా ఉందని, రాముడి ప్రతిమ చూసి చాలా సంతోషం కలిగిందని తెలిపారు. దీంతో... ఎంపీగా తమిళసై అనే ఊహాగాణాలకు తెరపడినట్లైంది!

Tags:    

Similar News