నాలుగు అంశాలే అజెండాగా గవర్నర్ ప్రసంగం!
ఇదే సమయంలో మధ్య మధ్య విభజన హామీలు, విభజన ద్వారా ఏపీ ఎంత నష్టపోయింది.. అనే విషయా లను కూడా గవర్నర్ ప్రస్తావించారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా 4 కీలక విషయాలను అజెండాగా తీసుకుని ఆయన ప్రస్తావించారు. వీటిలో ప్రధానంగా 1) 2014-19 మధ్య చంద్రబాబు పాలన, 2) 2019-24 మధ్య వైసీపీ పరిపాలన, 3) చంద్రబాబు దూరదృష్టి, 4) ప్రస్తుత ఎన్డీయే కూటమి సర్కారు ఏం చేస్తుంది. అనే విషయాలను ప్రధానంగా గవర్నర్ వివరించారు. ఇదే సమయంలో మధ్య మధ్య విభజన హామీలు, విభజన ద్వారా ఏపీ ఎంత నష్టపోయింది.. అనే విషయా లను కూడా గవర్నర్ ప్రస్తావించారు.
1) 2014-19 మధ్య చంద్రబాబు పాలన:
2014-19 మధ్య చంద్రబాబు పాలన కారణంగా..రాష్ట్రం అద్భుతంగా ముందుకు సాగిందని గవర్నర్ చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాజధాని అమరావతి.. నవనగరాలకు కూడా అంకురార్ఫణ జరిగినట్టు వివరించారు. భారీ ఎత్తున సంస్థలను తీసుకువచ్చారని తెలిపారు. 2014-19 తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగి ఉంటే రాష్ట్రం ఈపాటికి అభివృద్ధి బాటలో పయనించేదన్నారు.
2) 2019-24 మధ్య వైసీపీ పరిపాలన:
గవర్నర్ తన ప్రసంగంలో 2019-24 మధ్య వైసీపీ పాలనను కూడా ప్రస్తావించారు. ఈ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందన్నారు. కోలుకోలేని విధంగా రాష్ట్రం వెనుకబడి పోయిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నష్టపోయారని.. ఇసుక, మద్యం, మూడు రాజధానులు, ల్యాండ్ యాక్ట్.. వంటి వివాదాస్పద అంశాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్టు గవర్నర్ వివరించారు.
3) చంద్రబాబు దూరదృష్టి:
చంద్రబాబు దూరదృష్టి కారణంగా.. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని గవర్నర్ చెప్పారు. ఈ సందర్భంగా సూపర్-6 పథకాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తున్నా మన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను చక్కదిద్దే పనిలో ఉన్నట్టు తెలిపారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగినట్టు చెప్పారు.
4) ప్రస్తుత ఎన్డీయే కూటమి సర్కారు ఏం చేస్తుంది:
రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి సర్కారు లక్ష్యం.. ప్రజల సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధేనని గవర్నర్ చెప్పారు. ముఖ్యంగా ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్ని స్తామన్నారు. అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించనున్నామన్నారు. అదేవిధంగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీని నిలబెట్టనున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు.