పవన్ ని ఓడించిన నేత జనసేన పార్టీలోకి ?
ఇక జగన్ అయితే రీల్ హీరోకు రియల్ హీరోకు మధ్య పోటీ అని జనాలకు చెప్పి గ్రంధి శ్రీనివాస్ కి హైప్ క్రియేట్ చేశారు.;

రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది మరి. ఎపుడు ఎవరు ఏ గూటికి చేరుతారో తెలియదు. భీమవరం అందరికీ గుర్తుందిగా. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరఫున తొలిసారి పోటీ చేశారు. ఆ సమయంలో వైసీపీ నుంచి సీనియర్ నేత గ్రంధి శ్రీనివాస్ పోటీ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ని 8,357 ఓట్ల తేడాతో గ్రంధి ఓడించి జెయింట్ కిల్లర్ అయ్యారు.
ఆ ఎన్నికలో గ్రంధి శ్రీనివాస్ కి 70,642 ఓట్లు రాగా పవన్ కళ్యాణ్ కి 62,285 ఓట్లు లభించాయి. హోరా హోరీ పోరు సాగింది. అయితే గ్రంధి తనకు స్థానికంగా ఉన్న బలంతో గెలిచారు. పైగా వైసీపీ ప్రభంజనం ఆయనకు తోడు అయింది. ఇక జగన్ అయితే రీల్ హీరోకు రియల్ హీరోకు మధ్య పోటీ అని జనాలకు చెప్పి గ్రంధి శ్రీనివాస్ కి హైప్ క్రియేట్ చేశారు.
ఇంకో వైపు చూస్తే టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల కూడా వైసీపీకి ఈ విజయం దక్కింది అన్న లెక్కలు కళ్ళ ముందు ఉన్నారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులుకు 54,036 ఓట్లు దక్కాయి. మరి ఆ ఓట్లూ జనసేన ఓట్లూ కలుపుకుంటే వైసీపీ ఓడేది అన్న అంచనాలే 2024లో నిజం అయ్యాయి.
ఏది ఏమైనా పవన్ ని ఓడించి గ్రంధి శ్రీనివాస్ ఒక టైం లో స్టేట్ వైడ్ ఫిగర్ గా నిలిచారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుంది అని కూడా అంతా జోస్యం చెప్పారు. కానీ అవేమీ జరగలేదు. 2024లో అదే పార్టీ నుంచి మరోసారి పోటీ చేసి భారీ ఓటమిని కొని తెచ్చుకున్న గ్రంధి శ్రీనివాస్ ఫ్యాన్ పార్టీలో ఉండలేక చాలా నెలల క్రితమే బయటకు వచ్చారు. ఆనాటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న చర్చ జరుగుతూనే ఉంది.
అంగబలం అర్ధబలం ఉన్న ఈ సీనియర్ నేత కూటమి వైపే చూస్తున్నారు అన్న ప్రచారం అయితే ఉంది. తాజాగా దానికి సంబంధించి ఒక కీలకమైన అప్ డేట్ బయటకు వచ్చింది. జనసేనలోకి గ్రంధి శ్రీనివాస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అన్నది ఆ వార్త. ఈ మేరకు ఆయన జనసేన నేతలతో చర్చలు జరుపుతున్నారు అని అంటున్నారు.
అయితే ఆయన చేరికకు స్థానిక నాయకులు అంతా ఓకేగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయనను తన పార్టీలోకి తీసుకుంటారా అన్నది చర్చగా ఉంది. ఒకనాడు తనను ఓడించిన వ్యక్తి ఇపుడు పార్టీలోకి వస్తాను అంటే అధినాయకుడికి అంతకంటే ఆనందం ఏమి ఉంటుంది అని అంటున్నారు. ఇక మరో వైపు చూస్తే గ్రంధి శ్రీనివాస్ విషయం చూస్తే ఆయనకు జనసేన అన్నది కొత్త కాదు అని అంటున్నారు.
ఆయన 2009 సమయంలో ప్రజారాజంలో పనిచేసిన వారే అని గుర్తు చేస్తున్నారు. గోదావరి జిల్లాలలో ఇపుడు ఒక బలమైన సామాజిక వర్గం పోలరైజ్ అవుతున్న క్రమంలో గ్రంధి లాంటి బిగ్ షాట్ వచ్చి చేరుతాను అంటే అది జనసేనకు లాభమే అని అంటున్నారు. దాంతో తొందరలోనే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఈ చేరిక ఒక హాట్ టాపిక్ అవుతుంది అని అంటున్నారు.