గ్రేటర్ ఎన్నికల వేళ కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం.. వాటిని విలీనం చేసేందుకు సిద్ధం.!

ఈ క్రమంలోనే ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాదులో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Update: 2025-01-23 14:30 GMT

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా నగరాన్ని విస్తరించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇందుకోసం కొత్త ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాదులో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణలను సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల్లో భాగంగానే ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ రూపురేఖలను మార్చాలన్న యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కీలక ప్రణాళికలను ఆయన అమలు చేస్తున్నారు. ఇప్పటికే హైడ్రా పేరుతో సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చిన ఆయన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి హైదరాబాదు నగరాన్ని అక్రమ నిర్మాణ రైతనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇందుకోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. నగర పరిధిని విస్తరించి మొత్తంగా ఒకటే మెగా కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మొదట ఆలోచించింది. అదే సమయంలో గ్రేటర్ ను మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు ప్రతిపాదనపైన చర్చలు జరిగాయి. దీనిపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. ఆ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మెలుగుతున్న కొందరు చెబుతున్నారు. జిహెచ్ఎంసి అని మినహాయిస్తే ఓఆర్ఆర్ లోపల 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. ఓఆర్ఆర్ వరకు నగరాన్ని ఒకే విధంగా అభివృద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జిహెచ్ఎంసిలో విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

దీనివల్ల గ్రేటర్ పరిధిలో 2,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే కొత్త సమస్యలు కూడా పుట్టుకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇది అమలు చేయాలంటే ముందుగా సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. కానీ వీటిలో కాంగ్రెస్కు పూర్తిస్థాయిలో మెజారిటీ లేదు. ఇదే సమయంలో వీటి పాలకవర్గాల గడువు ముగియబోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అంశం చర్చకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలను వాయిదా వేసి కమిటీ ద్వారా వీటి విలీనంపై నివేదిక కోరేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈలోగా జిహెచ్ఎంసి గడువు ముగిసిపోతుంది. అదే సమయంలో శివారులోని స్థానిక సంస్థల విలీనం, జిహెచ్ఎంసి విభజన అంశాలపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఆ తరువాతే ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొంటున్నారు. రానున్న మంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో.

Tags:    

Similar News