అదిరేలా అక్టోబరు జీఎస్టీ వసూళ్లు.. ఆ తర్వాత ఇదే అత్యధికం
ఒక దేశం.. ఒకే పన్ను పేరుతో తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లకు సంబంధించి అక్టోబరు నెలలో రికార్డు స్థాయిలో పెరిగాయి.
ఒక దేశం.. ఒకే పన్ను పేరుతో తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లకు సంబంధించి అక్టోబరు నెలలో రికార్డు స్థాయిలో పెరిగాయి. జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత రెండో అత్యధిక వసూళ్లకు అక్టోబరు వేదికగా మారింది. ఒకే నెలలో రెండు పెద్ద పండుగలు( దసరా, దీపావళి) రావటం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. దసరా దేశంలోని పలు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగగా చేసుకోవటం తెలిసిందే. దీపావళి.. దాని హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
గత ఏడాది (2023)తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరు జీఎస్టీ వసూళ్లు 9 శాతం వ్రద్ధితో రూ.1.87లక్షల కోట్లుగా నమోదైంది. జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక నెలలో రెండో అత్యధికంగా చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 మధ్య) ఏప్రిల్ లో ఏకంగా రూ.2.10 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారీ వసూళ్లే ఇప్పటివరకు ఆల్ టైం రికార్డుగా చెప్పాలి. ఈ అక్టోబరులో రెండో అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి.
దేశీయ అమ్మకాలు.. పన్నుపరిధి విస్త్రతి కూడా తాజా రికార్డుస్థాయి వసూళ్లకు కారణంగా భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అక్టోబరులో వసూలైన జీఎస్టీ వసూళ్లు రూ.1,87,346 కోట్లలో రూ.19,306 కోట్లు రిఫండ్స్ జరిగాయి. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది రీఫండ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటిని కూడా మినహాయిస్తే జీఎస్టీ వసూళ్లలో 8 శాతం వ్రద్ధితో రూ.1.68 లక్షల కోట్లుగా తేలింది. ఇంత భారీ ఎత్తున వసూళ్లు ఒక శుభసూచికగా పేర్కొంటున్నారు. ఇదే జోరు కొనసాగితే రానున్న రోజుల్లో మరింత భారీ వసూళ్లు ఖాయమన్న మాట వినిపిస్తోంది.