వైసీపీ లో యాంటీ సెంటిమెంట్ భయం ?

వైసీపీ ఏర్పాటు అయ్యాక విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గా వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యవహరించారు.

Update: 2025-01-23 10:30 GMT

విశాఖ వైసీపీ అధ్యక్షుడిగా ఎవరు పనిచేసిన ఎత్తి గిల్లడం లేదన్న యాంటీ సెంటిమెంట్ ఇపుడు చర్చకు తావిస్తోంది. పార్టీ అన్నాక ప్రెసిడెంట్ ఉంటారు. అయితే ప్రెసిడెంట్ కూడా అధికార పదవులు అందుకోవాలని చూస్తారు. వైసీపీ విషయంలో మాత్రం అలా జరగడం లేదని అంతా పెదవి విరుస్తున్నారు.

వైసీపీ ఏర్పాటు అయ్యాక విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గా వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యవహరించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా గెలవకుండానే పార్టీని వీడాల్సి వచ్చింది. బలమైన సామాజిక వర్గం వెంట ఉంది, అర్థ బలం కూడా ఉంది. అయినా ఆయనను ఓటమి వరించింది.

ఇక గుడివాడ అమర్నాధ్ ఆయన తరువాత వైసీపీ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ ఆయనకు గాజువాక సీటు అయితే దక్కలేదు. పైగా ఆయన సైతం అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కొంతకాలం వైసీపీ ప్రెసిడెంట్ గా చేసారు అయితే ఆయనకు కూడా ఏ మాత్రం కలిసి రాకపోగా ఆయన నియోజకవర్గంలోనే వర్గ పోరు ముమ్మరమై చివరికి ఆయన రాజకీయ జీవితంలో తొలిసారి ఓటమిని మూటకట్టుకున్నారు.

అలాగే కోలా గురువులు వైసీపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన కూడా చట్ట సభలలో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేకపోయారు. ఆఖరుకు ప్రెసిడెంట్ గా ఉన్నా కూడా తన సొంత నియోజకవర్గం టికెట్ ని సాధించుకోలేకపోయారు.

ఇపుడు మరోమారు గుడివాడ వైసీపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన భీమిలీ కానీ గాజువాక కానీ కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఆయనను విశాఖకు ఏకంగా అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చోడవరం నియోజకవర్గానిని ఇంచార్జిగా వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. దాంతో ఆయన వర్గీయులలో అసంతృప్తి మొదలైంది.

విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న గుడివాడకి ఈ జిల్లాలో ఇంచార్జిగా చేయడానికి ఒక్క నియోజకవర్గమూ దొరకలేదా అని అంటున్నారు. పార్టీ అలా దూరంగా విసిరెసినట్లుగా చోడవరానికి పంపించడమేంటని గుస్సా అవుతున్నారు. గుడివాడది అయితే చెప్పుకోలేని బాధ అంటున్నారు. ఈ పరిణామాలు చూసిన వారు విశాఖ జిల్లా అధ్యక్ష పదవి వద్దే వద్దు అని అనేస్తున్నారుట. మొత్తానికి చూస్తే ఈ పదవిలోకి వచ్చిన వారికి ఇబ్బందులేనా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News