ఎర్రమట్టి దిబ్బలు... ఇప్పుడు అమర్నాథ్ వంతు!
ఈ నేపథ్యంలో... మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ మేరకు ఎర్రమట్టి దిబ్బలను సందర్శించిన ఫోటోను షేర్ చేసిన అమర్నాథ్ ఒక ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఏపీలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న ఎర్రమట్టి దిబ్బల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తొలుత... ఈ ఎర్రమట్టి దిబ్బలను అక్రమంగా తవ్వేస్తున్నారంటూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మెరకు ఆయన ఎక్స్ లో స్పందిస్తూ ఓ వీడియో, కొన్ని ఫోటోలు పెట్టి పవన్ కు ఫిర్యాదు చేశారు.
దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పైగా పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ ఉండటంతో... ఆయన రియాక్షన్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్న ప్రదేశాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. భారీగా జేసీబీలతో పనులు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోపక్క ఈ వ్యవహారంపై ఏపీ సీఎం కార్యాలయం స్పందించింది. ఇందులో భాగంగా.. జిల్లా అధికారులతో మాట్లాడి తవ్వకాలను నిలిపి వేయించింది. ఇదే సమయంలో... పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనిపై పూర్తీ వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో... మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ మేరకు ఎర్రమట్టి దిబ్బలను సందర్శించిన ఫోటోను షేర్ చేసిన అమర్నాథ్ ఒక ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు, చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 35 రోజుల్లో విశాఖలోని భౌగోళిక వార్సత్వ సంపద ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇది అని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో... ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో... కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇలా చెప్పకనే చెప్తున్నారంటూ కామెంట్ చేశారు గుడివాడ అమర్నాథ్.
కాగా... తొలుత ఈ అంశాన్ని లేవనెత్తింది జనసేన నేత బొలిశెట్టి సత్యన్నారాయణ అనేది తెలిసిన విషయమే. ఎక్స్ లో వీడియో, కొన్ని స్క్రీన్ షాట్ లను షేర్ చేస్తూ.. ఎర్రమట్టి దిబ్బల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. ఈ తవ్వకాలను ఆపాలని పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో... ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. దీంతో... ఏకంగా సీఎంఓ స్పందించింది.