అమెరికాలో దారుణం.. మళ్లీ పేలిన గన్‌!

అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్న గన్‌ కల్చర్‌ పై గతంలో పలుమార్లు దేశాధ్యక్షుడు జో బైడెన్‌ కంటతడి కూడా పెట్టుకున్నారు.

Update: 2024-03-04 09:35 GMT

అగ్ర రాజ్యం అమెరికాలో ద్వేషపూరిత నేరాలు, సామూహికంగా కాల్చిచంపడం వంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గన్‌ కల్చర్‌ సంస్కృతికి చరమగీతం పాడాలని అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ లో బిల్లును కూడా పెట్టారు. అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్న గన్‌ కల్చర్‌ పై గతంలో పలుమార్లు దేశాధ్యక్షుడు జో బైడెన్‌ కంటతడి కూడా పెట్టుకున్నారు.

అయినా సరే గన్‌ కల్చర్‌ సంస్కృతికి అమెరికాలో ఏమాత్రం అడ్డుకట్ట పడలేదు. తాజాగా అమెరికాలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కాలిఫోర్నియాలోని కింగ్‌ సిటీలో మళ్లీ తుపాకులు గర్జించాయి.

అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి కాలిఫోర్నియాలోని కింగ్‌ సిటీలో 2వ వీధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక ఇంటి ముందు బర్త్‌ డే పార్టీ జరుగుతుండగా ముదురు రంగు దుస్తులు, ముఖానికి మాస్క్‌ లతో కారులో వచ్చిన ముగ్గురు తుపాకీలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే ముగ్గురు పురుషులు తుపాకీ తూటాలతో మృత్యువాత పడ్డారు. ఒక మహిళను ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించింది.

ఈ ఘటనలో మొత్తం ఏడుగురిపై కాల్పులు జరపగా వారిలో నలుగురు తుపాకీ తూటాలకు బలయ్యారు. మరో ముగ్గురు గాయపడటంతో వారిని ఆస్పత్రులకు తరలించారు. కాగా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా నిందితులు కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆ ముగ్గురి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

కింగ్‌ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మాంటెరీ కౌంటీ సూపర్‌ వైజర్‌ క్రిస్‌ లోపెజ్‌ మాట్లాడుతూ.. ‘కింగ్‌ సిటీలో రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి మేము వివరాల కోసం ఎదురు చూస్తున్నాము. మృతి చెందినవారికి మా సంతాపాన్ని, గాయపడినవారికి మా సానుభూతిని తెలియజేస్తున్నాం. బాధితులకు ఇప్పుడు మెరుగైన వైద్యం అందించడమే మా తక్షణ కర్తవ్యం. అలాగే వారికి భద్రత కల్పించడం, ప్రశాంతంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. మన ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతాం.. ఎవరూ ఆందోళన చెందవద్దు‘ అని కోరారు.

Tags:    

Similar News