బోరుగడ్డ అనిల్ అరెస్ట్... కేసు ఏమిటంటే..?

చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అత్యంత నీచమైన భాషలో దూసిస్తూ.. టీవీ డిబేట్లలోనూ బూతులు మాట్లాడేవాడు అనిల్!

Update: 2024-10-17 07:10 GMT

గత ప్రభుత్వ హయాంలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఒకరు! రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా జగన్ ని ఒక్కమాట అంటే.. అంతెత్తున విరుచుకుపడుతూ.. చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అత్యంత నీచమైన భాషలో దూసిస్తూ.. టీవీ డిబేట్లలోనూ బూతులు మాట్లాడేవాడు అనిల్!

గుంటూరు టౌన్ కు చెందిన బోరుగడ్డ్ అనిల్.. కేంద్రమంత్రిగా పనిచేసిన రాందాస్ అథవాలే అనుచరుడిగా చెప్పుకొంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణీ అయ్యాడు. జగన్ ను "అన్నా" అంటూ అంబోధిస్తూ వైసీపీతో అంటకాగుతూ.. ఆ ఐదేళ్లు రెచ్చిపోయాడు.. విచ్చలవిడిగా దారుణాలకు పాల్పడ్డాడు! తాజాగా అరెస్ట్ అయ్యాడు!

అవును... గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జనాన్ని హడలగొట్టిన బోరుగడ్డ అనిల్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు! 2021లో కర్లపూడి బాబూప్రకాష్ ను రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో తాజాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీంతో... ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ సహా వారి కుటుంబ సభ్యుల్ని అసభ్యపదజాలంతో దూషించిన వ్యక్తికి రాచమర్యాదలు చేయడం ఏమిటంటూ పోలీసులను ప్రశ్నించారు.

ఇతనిపై గుంటూరుతో పాటు గతంలో అనంతపురంలోనూ ఓ కేసు నమోదైంది. తన అనుచరులతో కలిసి ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి దాడి చేయడం...వంటి కేసుల్లో అనిల్ నిందితుడిగా ఉన్నాడని చెబుతున్నారు. గుంటూరులో అర్ధరాత్రి సమయాల్లో ఇతడు స్థానికులకు నరకం చూపించాడని చెబుతున్నారు.

ఇక నాడు ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నేతలపై సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియా లోనూ, టీవీ డిబేట్లలోనూ ఇస్టానుసారంగా దూషణలు చేశాడు. జగన్ కు వ్యతిరేకంగా ఎవరి మాట్లాడినా వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవాడు. ఒకానొక దశలో జగన్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే చంపేస్తానంటూ కూడా బెదిరించిన పరిస్థితి!

ఇక చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపైనా తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశాడు బోరుగడ్డ అనిల్. ఈ క్రమంలోనే... జగన్ ఆదేశిస్తే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను చంపుతానని గతంలో బహిరంగంగా ప్రకటించాడు కూడా. ఈ రేంజ్ లో చెలరేగిపోయిన అనిల్... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం కనిపించకుండా పోయాడు!

ఈ క్రమంలో వేరే రాష్ట్రాలకు వెళ్లి తల దాచుకున్నాడని అంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం గుంటూరు వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు!

Tags:    

Similar News