కూటమికి ఇరకాటంలో పెట్టిన మాజీ ఎంపీ జీవీఎల్ ?

దానికి సంకేతాలుగా ఆయా నాయకులు చేసే వ్యాఖ్యలు కూడా జనాలను ఆలోచింప చేస్తూంటాయి.

Update: 2024-07-31 17:09 GMT

బీజేపీలో ఎంతో మంది నేతలు ఉన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు అలాగే పార్టీలో కొత్తగా చేరిన వారు. ఇక టీడీపీ పట్ల సానుభూతిగా ఉన్నవారు, వైసీపీ పట్ల సింపతీ చూపించేవారు ఇలా ఏపీ బీజేపీలో వర్గాలు ఉన్నాయని అంతా ప్రచారం చేస్తూంటారు. దానికి సంకేతాలుగా ఆయా నాయకులు చేసే వ్యాఖ్యలు కూడా జనాలను ఆలోచింప చేస్తూంటాయి.

ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 మధ్యలో ఏపీలో టీడీపీ ప్రభుత్వ పాలన సాగింది. ఆ పాలనలో నాలుగేళ్ల పాటు బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది. అయితే ఆనాడు కూడా బీజేపీలో కొందరు అధికార టీడీపీని ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్ చేస్తూ వచ్చేవారు. దాంతో అప్పటి ప్రతిపక్ష వైసీపీకి అది పొలిటికల్ అడ్వాంటేజ్ గా మారేది.

ఇక ఇపుడు చూస్తే ఏపీలో మరోసారి టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. ఇంతలో కూటమి ప్రభుత్వానికి మిత్రులే ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలెట్టారా అన్న చర్చ సాగుతోంది. కారణం ఏమిటి అంటే తాజాగా విశాఖలో ప్రెస్ మీట్ పెట్టిన బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కొన్ని కీలక కామెంట్స్ చేశారు.

అవేంటి అంటే అమరావతి రాజధానికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదని అప్పు అని కుండబద్ధలు కొట్టారు. అలా ఇచ్చే పదిహేను వేల కోట్ల రూపాయలను దీర్ఘకాలంలో తీర్చడానికి ఏపీ ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుందని మరో మాట అన్నారు. అయితే ఆయన ఇంకోటి కూడా చెప్పారు. ఈ అప్పు కేంద్రం తీర్చాలా లేక రాష్ట్రం తీర్చాల అన్నది ఇంకా క్లారిటీ లేదని.

అయితే ఏపీకి ఇచ్చేది అప్పు మాత్రమే అని జీవీఎల్ స్పష్టం చేశారు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి రోజు నుంచి ఏపీలో వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఏపీకి బడ్జెట్ లో టీడీపీ ఏమీ సాధించలేకపోయిందని అప్పులు మాత్రమే కేంద్రం ఇచ్చిందని వైసీపీ ఒక వైపు గట్టిగా తగులుకుంటోంది.

ఇక్కడ చిత్రమేంటి అంటే బీజేపీకి చెందిన ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రమే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ కేంద్రం అమరావతి రాజధానికి ఇస్తోంది గ్రాంట్ అని గట్టిగా బల్లగుద్ది చెప్పారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు కేంద్రం తెస్తోందని అది ఏపీకి ఏ విధంగానూ సంబంధం లేదని వారు చెప్పారు.

ఇలా ఒక వైపు సొంత పార్టీ ఎంపీలు ఇలా ఏపీకి ఇచ్చేది గ్రాంట్ అని సమర్ధించుకుంటూ వస్తున్న వేళ జీవీఎల్ మాత్రం పూర్తిగా వేరే విధంగా చెప్పడంతో కూటమిలో చర్చ సాగుతోంది. పైగా జీవీఎల్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో వైసీపీకి కొత్త ఆయుధం దొరికింది అని అంటున్నారు.

జీవీఎల్ చెప్పినది చూస్తూంటే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఏపీలో వ్యతిరేకత వచ్చేలా ఉందని అంటున్నారు. కేంద్రం ఏపీకి పెద్ద ఎత్తున సాయం చేసింది అని చెప్పుకోవడానికి బదులు ఆయన అప్పు అని తేల్చేస్తే ఏపీ మీద కేంద్రం తీరు ఇంతేనా అని జనాలు అనుకునే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

అయితే మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికే జీవీఎల్ ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారా అన్న చర్చ కూడా సాగుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నుంచి జీవీఎల్ తో పాటు సోము వీర్రాజు వంటి నేతలు తమ మిత్రపక్ష ప్రభుత్వం మీదనే నిశిత విమర్శలు చేస్తూ ఉండేవారు.

అది ఒక పొలిటికల్ గేమ్ గా కూడా అంతా చూస్తూ వచ్చారు. ఇపుడు కూడా అలాంటి గేమ్ మళ్లీ స్టార్ట్ అయిందా అన్న చర్చ కూడా సాగుతోంది. దీని వల్ల కేంద్రంలోని ఎన్డీయే అలాగే ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బందే అని అంటున్నారు. మరి జీవీఎల్ ఇచ్చిన స్టేట్మెంట్ లో నిజాయతీ ఉందని అనుకున్నా కొంతకాలం వేచి చూసి మాట్లాడితే బాగుండేది అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News