అమరావతికి ఇచ్చేది అప్పు... బీజేపీ మాజీ ఎంపీ క్లారిటీ

ఈ మొత్తంతో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా అవతరిస్తుందని చెప్పారు.

Update: 2024-07-30 08:09 GMT

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఇస్తోంది అప్పు అని బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పూర్తి స్పష్టత ఇచ్చారు. ఏపీకి తాజా బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం ఈ విధంగా సాయం చేస్తోంది అని ఆయన అన్నారు.

ఈ మొత్తంతో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా అవతరిస్తుందని చెప్పారు. ఇక అమరావతి రాజధానికి 15 వేల కోట్ల రూపాయలుగా ఇచ్చేఅప్పును రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలా లేక కేంద్ర ప్రభుత్వం తీర్చాలా అన్న దాని మీద స్పష్టత రావాల్సి ఉందని జీవీఎల్ అన్నారు.

అయితే ఏపీకి రాజధాని అవసరం ఉందని అందుకే రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలను రుణ రూపంలో తీసుకుని కేంద్రం ఏపికి ఇస్తోందని ఆయన వివరించారు. ఈ అప్పుని కూడా దీర్ఘకాలంలో తీర్చే విధంగా వెసులుబాటు ఉంటుందని జీవీఎల్ చెప్పారు. అయితే దీనిపైన పూర్తి వివరాలు రావాల్సి ఉందని అన్నారు.

ఏపీ విభజన తరువాత పూర్తిగా నష్టపోవడానికి కారణం రాజధాని లేకపోవడమే అని జీవీఎల్ అన్నారు. ఆ లోటుని కేంద్రం పూర్తి చేస్తోదని చెప్పారు. కేంద్ర బడ్జెట్ అయితే బ్రహ్మాండంగా ఉందని ఆయన మెచ్చుకున్నారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా చేసుకుని కేంద్ర బడ్జెట్ లో అనేక కీలకమైన రంగాలకు కేటాయింపులు చేశారని గుర్తు చేసారు. ఈ బడ్జెట్ అన్నది అన్ని వర్గాలు మెచ్చేలా ఉందని అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా వికసిత ఏపి లక్ష్యంగా ప్రజలకు ఉపయోగపడేలా కేటాయింపులు చేశారని ఆయన చెప్పారు.

ఈ బడ్జెట్ వల్ల వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా వున్న ఏపి ఇకపై పారిశ్రామిక ప్రగతి సాధిస్తుందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. విశాఖ- చెన్నై కారిడార్ లో కొప్పర్తి లో పారిశ్రామిక నగరం నిర్మాణం చేపడతారని, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్దికి గతంలో 11 వేల కోట్లు కేంద్రం అందించిందని ఆయన చెప్పారు. అలాగే బడ్జెట్ లో వెనుకబడిన జిల్లాల అభివృద్దికి ప్రత్యేక ప్యాకేజి కూడా ఇచ్చారని చెప్పారు.

డబుల్ ఇంజన్ అభివృద్దికి ఈ బడ్జెట్ ఒక సూచికనే చెప్పాలని అన్నారు. ఇదిలా ఉండగా వైసీపీ అధినేత జగన్ మీద జీవీఎల్ సెటైర్లు వేశారు. ప్రతిపక్ష హోదా చట్టబద్దంగా వచ్చే హక్కు అని అది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు‌‌ అని అన్నారు. పది శాతం లేని సీట్లు లేని వారు ప్రతి పక్ష హోదా అడగడం సరికాదని అన్నారు. అయినా ప్రజల సమస్యలు పై పోరాటం చెయ్యడానికి హోదా ఉండాలా అని జగన్ ని నిలదీశారు.

అదే విధంగా జగన్ కోరినట్లుగా ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలలన్నది అనవసరమైనదిగా ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని జీవీఎల్ చెప్పారు. దేశంలో పదేళ్ళుగా మంచి పాలనను నరేంద్ర మోడీ అందిస్తూంటే కాంగ్రెస్ పార్టీ కళ్లలో నిప్పులు పోసుకుంటోందని జీవీఎల్ ఫైర్ అయ్యారు. మన్నోహన్ సింగ్ ని ప్రధానిగా ఉంచి వెనకాల స్టీరింగ్ నడిపింది ఎవరో దేశానికి తెలుసు అని కాంగ్రెస్ పార్టీ మీద ఆయన కామెంట్స్ చేశారు.

Tags:    

Similar News