ఇంకొక్క వికెట్ పడితే.. 'విశాఖ' కైవసం.. !
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పై పంజా విసిరిన కూటమి నేతలు.. దీనిని కైవసం చేసుకునే క్రమంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు.;

గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పై పంజా విసిరిన కూటమి నేతలు.. దీనిని కైవసం చేసుకునే క్రమంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ నాయకురాలు, మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాసం పెట్టిన కూటమి.. దీనిని సాధించేందుకు విజయం దక్కించుకుని కార్పొరేషన్ పై ఉమ్మడి జెండా ఎగరేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి వస్తున్న కార్పొరేటర్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు ఒకే ఒక్క సంఖ్య తేడా గా ఉండడం గమనార్హం.
మొత్తం 98 వార్డులు ఉన్నాయి. అంటే.. 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇక, నామినేటెడ్, ఎక్స్ అఫిషియో సభ్యులు కలిసి.. మొత్తంగా గ్రేటర్ విశాఖ పరిధిలో ఒక్క సీటు తక్కువగా కూటమి మెజారిటీ దక్కించుకుంది. అయితే.. ఈ నెల 19వ తేదీన జరగనున్న అవిశ్వాస ఓటింగ్ విషయంలో అప్రమత్తంగానే ఉంటున్నారు. ఇదిలావుంటే... తమవారిని కాపాడుకునేందుకు వైసీపీ కీలక నేతలు.. రంగంలోకి దిగారు. సాధ్యమైనంతవరకు వారిని కూటమి జోలికి పోకుండా కూడా చూసుకుంటున్నారు. కానీ, అది సాధ్యం కావడం లేదు.
ఇక, తాజాగా సోమవారం రాత్రి.. వైసీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీనియర్ నేత బెహరా భాస్కర్ రావుతోపాటు 91వ వార్డు కార్పొరేటర్ జోత్స్న, 92వ వార్డు కార్పొరేటర్ బెహరా వెంకట స్వర్ణలత శివ దేవ గుడ్ బై చెప్పారు. దీంతో వైసీపీ ఆశలు, అంచనాలు కూడా తారుమారయ్యాయి. వీరు మరికొద్ది రోజుల్లో జనసేన పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానంపై ఈనెల 19న జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. ఇటీవల 74వ డివిజన్ కార్పొరేటర్ వంశీ రెడ్డి సైతం వైసీపీని వీడారు.
అయితే.. ఆయన విషయంలో టీడీపీ, జనసేన పోటీ పడు తున్నట్టు సమాచారం. ఏదేమైనా వంశీ త్వరలోనే పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇక, మరో నాలుగు రోజుల్లో అవిశ్వాసంపై ఓటింగ్ జరనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న విషయంపై దాదాపు స్పష్టత వచ్చేసింది. కూటమి బలానికి ఒక్క సీటు మాత్రమే తక్కువగా ఉండడంతో దానిని కూడా సాధించేందుకు కీలక నాయకులు రంగంలోకి దిగారు. ఇప్పటికే కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు.. విశాఖలో పాగా వేసేందుకు కంకణం కట్టుకున్నారు. మరోవైపు ఎంపీ భరత్, పల్లా శ్రీనివాసరావు కూడా తమ దైన శైలిలో కార్పొరేషన్‌ను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. వైసీపీ జెండా దిగిపోతుందన్న చర్చ జోరుగాసాగుతుండడం గమనార్హం.