19 వరకు పరీక్షే.. విశాఖ నేతల ఉక్కిరిబిక్కిరి..!
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ హరి వెంకట కుమారిపై కూటమి నాయకులు అవిశ్వాసం నోటీసు అందజేసిన విషయం తెలిసిందే.;

విశాఖపట్నం రాజకీయాలు మరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నా.. ఇప్పుడు విశాఖ పట్నం గ్రేటర్ మునిసిపాలిటీని కూటమి పార్టీలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్న దరిమిలా.. ఇటు ప్రతిపక్ష వైసీపీ కూడా అలెర్ట్ అయింది. తన పార్టీకి చెందిన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. అయితే.. ఈ వెయిటింగ్ ఈ నెల 19 వ తేదీ వరకు ఉండడం.. ఆరోజు వరకు కార్పొరేటర్లను కాపాడుకోవడం వంటివి.. వైసీపిక తలకు మించిన భారంగా మారింది.
ఏం జరిగింది?
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ హరి వెంకట కుమారిపై కూటమి నాయకులు అవిశ్వాసం నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. గత నెలలోనే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్‌లు.. ఈ మేరకు తీర్మానం రెడీ చేసి.. కలెక్టర్‌కు అందించారు. ఆ వెంటనే ఆయన ఈ నోటీసుల ఆధారంగా.. ఈ నెల 19న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నోటీసులు.. కార్పొరేషన్ గోడలపైనా అతికించారు. దీంతో అవిశ్వాసం నుంచి బయటకు పడేందుకు.. వైసీపీ తన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది.
అయినప్పటికీ.. చాలా మంది కార్పొరేటర్లు ఇప్పటికే వెళ్లి.. కూటమి పార్టీల్లో చేరిపోయారు. ఇదిలావుంటే.. కలెక్టర్ ఇచ్చిన నోటీసుల్లో... ‘‘మహా విశాఖ నగర పాలక సంస్థ కౌన్సిల్.. మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తుంది’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. దీనినే ఆయన తీర్మానంగా పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఏదైనా నోటీసులపై చర్చించిన తర్వాత.. కౌన్సిల్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి.. ఆ తర్వాత.. తీర్మానం చేస్తారు. కానీ, ఇప్పుడు తీర్మానం అని రాయడంతో వైసీపీ దీనిని కోర్టులో సవాల్ చేసేందుకు అవకాశం ఏర్పడిందన్న చర్చ సాగుతోంది.
ప్రత్యేక అవిశ్వాస సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరై, వారి అభిప్రాయాన్ని మేయర్‌కు వ్యతిరేకంగా చెబితే, అప్పుడు కలెక్టర్ ప్రత్యేకాధికారి హోదాలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మేయర్‌పై అవిశ్వాస ప్రతిపాదన చర్చనీయాంశంగా మాత్రమే నోటీసులో పేర్కొనాలి. ఇదిలావుంటే.. మరోవైపు.. కూటమి పార్టీల క్యాంపులు, వైసీపీ క్యాంపులు కూడా.. జోరుగా సాగుతున్నాయి. భీమిలిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్పొరేటర్లను.. ముందుండి నడిపిస్తున్నారు. వైసీపీలో ఇంతబలమైన నాయకుడు లేకపోవడం గమనార్హం. ఎలా చూసుకున్నా.. ఈ నెల 19 వరకు వీరికి వెయిటింగ్ తప్పదన్న సంకేతాలు వచ్చాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.