దేశం విడిచి వెళ్లొద్దు.. హెచ్1బీ వీసాదారులకు టెక్ దిగ్గజాల హెచ్చరిక
ముఖ్యంగా హెచ్1బీ వీసాపై ఆధారపడి పనిచేస్తున్న వేలాది మంది నిపుణులు తమ భవిష్యత్తు గురించి తీవ్రంగా కలత చెందుతున్నారు.;

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వలస విధానాల నేపథ్యంలో హెచ్1బీ వీసాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజ సంస్థలు తమ హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులను అప్రమత్తం చేశాయి. దేశం విడిచి వెళ్లవద్దని, ఒకవేళ వెళితే తిరిగి రావడానికి అనుమతి లభిస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా హెచ్1బీ వీసాపై ఆధారపడి పనిచేస్తున్న వేలాది మంది నిపుణులు తమ భవిష్యత్తు గురించి తీవ్రంగా కలత చెందుతున్నారు. తిరిగి అమెరికాలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారేమోననే భయంతో చాలామంది తమ భారత్ పర్యటనలను కూడా వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై ఇద్దరు వీసాదారులు మాట్లాడుతూ "ప్రస్తున్న పరిస్థితుల్లో భారత్‌కు వెళ్లాలనే ఆలోచనను వాయిదా వేసుకున్నాం. ఒకవేళ వెళితే తిరిగి అమెరికాలోకి అనుమతిస్తారో లేదో అనే భయం వెంటాడుతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ యంత్రాంగం యొక్క నిర్ణయంపై ఓ భారతీయ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేస్తూ, "ఒకవేళ చట్టం మారితే, భవిష్యత్తులో ఇక్కడ జన్మించే మా పిల్లలకు ఏ దేశం ఉండదు" అని వాపోయారు. మరొక ఉద్యోగి మాట్లాడుతూ "అమెరికా పౌరులు కానివారు ఎవరైనా ఇక్కడ చట్టవిరుద్ధంగా ఉంటున్నారనే భావన ఉంది. ఈ కారణంగానే ఎక్కడికి వెళ్లినా అవసరమైన అన్ని పత్రాలను వెంట ఉంచుకుంటున్నాం" అని తెలిపారు.
- హెచ్1బీ వీసా ప్రాముఖ్యత:
హెచ్1బీ వీసా అనేది అమెరికాలో పనిచేయడానికి విదేశీ నిపుణులకు జారీ చేసే ఒక తాత్కాలిక వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను అమెరికాలోని కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. ప్రతి సంవత్సరం లాటరీ పద్ధతి ద్వారా 65 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. ఈ వీసా పొందిన వారిలో భారతీయులు, చైనీయులు, కెనడియన్లు ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా భారతీయ నిపుణులు అమెరికా ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి పెద్ద సంస్థలు ఈ వీసాదారులను ఎక్కువగా నియమించుకుంటున్నాయి.
- వలసదారులకు అమెరికా అధికారుల సూచనలు:
ఇటీవల అమెరికా వలస విభాగం అధికారులు హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికాలోకి ప్రవేశించేటప్పుడు , బయటకు వెళ్లేటప్పుడు తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని, కాబట్టి సహనంతో ఉండాలని పేర్కొన్నారు. ఎక్కువ కాలం విదేశాల్లో ఉండి తిరిగి వచ్చే వలసదారులు కస్టమ్స్ , బార్డర్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.
అలాగే వలసదారులు తమ పాస్‌పోర్ట్‌తో పాటు గ్రీన్‌కార్డు, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఉద్యోగ ధ్రువీకరణ పత్రం, ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లింపు రసీదులు, వేతన స్లిప్పులు వంటి అన్ని ముఖ్యమైన పత్రాలను ఎల్లప్పుడూ తమ వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులు అయితే తమ కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుండి పొందిన అనుమతి పత్రంతో పాటు యుఎస్ బ్యాంకు ఖాతా వివరాలను కూడా చూపించాల్సి ఉంటుందని తెలిపారు.
మొత్తానికి, అమెరికాలో నెలకొన్న ప్రస్తుత వలస విధానాల నేపథ్యంలో హెచ్1బీ వీసాదారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. టెక్ దిగ్గజాల హెచ్చరికలు వారి ఆందోళనను మరింత పెంచేలా ఉన్నాయి. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.