భూమ్మీద సగంమంది పిల్లలకు చదువు లేని దేశం అదొక్కటే?

అలాంటి బాల్యం పరిశ్రమల్లోనో.. పొలాల్లోనో.. ఏదీ కాకుండా వీధుల పాలైతేనో..? ఇది ఒక వ్యక్తికి కాకుండా ఒక దేశం మొత్తానికి జరిగితేనో..?

Update: 2025-01-01 03:00 GMT

ఏ వ్యక్తికైనా బాల్యం అత్యంత మధురం. ఆటలు.. పాటలతో పాటు చదువు.. జీవితంలో వెనక్కు తిరిగిరాని రోజులవి. పెద్దయ్యాక తలచుకుంటేనే పులకించిపోయేంత కాలం అది. అలాంటి బాల్యం పరిశ్రమల్లోనో.. పొలాల్లోనో.. ఏదీ కాకుండా వీధుల పాలైతేనో..? ఇది ఒక వ్యక్తికి కాకుండా ఒక దేశం మొత్తానికి జరిగితేనో..?

ఒకప్పుడు అందాల దేశం..

పశ్చిమాసియా అంటేనే కక్షలు. ఒక ఇజ్రాయెల్.. చుట్టూ అరబ్ దేశాలు. నిత్యం అల్లకల్లోలం. అలాంటి ప్రాంతంలోనిదే సిరియా. ఒకప్పుడు అందాలతో అలరారుతూ పశ్చిమాసియాలో పోష్ కల్చర్ కు పేరుగాంచింది. కానీ, అంతర్యుద్ధాలతో, బషర్ కుటుంబ పాలనతో చిన్నాభిన్నమైంది.

2011 నుంచి..

సిరియాలో 2011 ప్రాంతంలో అంతర్యుద్ధం చెలరేగింది. అధ్యక్షుడు బషర్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. సైన్యం, రష్యా, ఇరాన్ సాయంతో బషర్ దీనిని అణగదొక్కారు. కానీ, 40 శాతం దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోనే ఉండిపోయింది. అప్పటినుంచి అంతర్యుద్ధం నడుస్తూనే ఉంది.

తిరుగుబాటుదారులు దూసుకురావడంతో డిసెంబరులో సిరియాలో బషర్‌ అల్‌-అసద్‌ ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. బషర్ ఆ వెంటనే రష్యాకు పారిపోయారు. సిరియాపై ‘సేవ్‌ ద చిల్డ్రన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సర్వే చేసింది.

సగంమంది సిరియన్ పిల్లలు పాఠశాల విద్యకు దూరంగానే ఉన్నారని ఆ సంస్థ సర్వేలో తేలింది. మరీ ముఖ్యంగా 14 ఏళ్ల నుంచి జరుగుతున్న అంతర్యుద్ధంతో వారు నలిగిపోయారని పేర్కొంది. వీరంతా 37 లక్షల మంది ఉంటారని.. అందరినీ ఇప్పుడు బడికి పంపాల్సి ఉందని వివరించింది.

మానసికంగానూ తీవ్ర ప్రభావం

సిరియా అంతర్యుద్ధాల ప్రభావం పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతోందట. యుద్ధ జ్ఞాపకాల నుంచి వారు బయట పడాలంటే మానసిక సాయం అవసరమని సేవ్ ద చిల్డ్రన్ సంస్థ చెబుతోంది.

ఇక అసద్‌ పరారీతో విదేశాల్లో ఉన్న సిరియన్లు తిరిగొస్తున్నారు. 6 నెలల్లో దాదాపు 10లక్షల మంది శరణార్థులు రానున్నట్లు అంచనా. దీంతో పాఠశాలలు వీరికి ఆశ్రయంగా మారనున్నాయి. ఇది కూడా చిన్నారులపైనే ప్రభావం చూపనుంది. పిల్లలు పాఠశాలలకు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం నెలకొందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

Tags:    

Similar News