ప్రొఫెసర్ హరిణి.. ఢిల్లీ కాలేజీ స్టూడెంట్.. శ్రీలంక ప్రధాని

భారత్ లో చదువుకుని పలు దేశాలకు అధ్యక్షులు, ప్రధానులు అయినవారు ఉన్నారు.

Update: 2024-09-25 06:45 GMT

భారత్ లో చదువుకుని పలు దేశాలకు అధ్యక్షులు, ప్రధానులు అయినవారు ఉన్నారు. వారు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు ఈ విషయాలు బయటపడుతుంటాయి. ఇప్పడు శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా నియమితులైన హరిణి అమరసూర్య (54) కూడా ఈ జాబితాలో చేరారు. దినేష్‌ గుణవర్ధన రాజీనామా అనంతరం హరిణికి పదవి దక్కంది. అయితే, ఈమె నేపథ్యం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వామపక్ష భావాలున్న దిసనాయకె ప్రభుత్వం హక్కుల కార్యకర్త అయిన హరిణిని ప్రధానిగా చేయడం గమనార్హం. ఇక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. ఈమె ఢిల్లీలో చదివినవారు కావడం విశేషం.

విద్యావంతురాలు.. 24 ఏళ్ల తర్వాత..

హరిణి అమరసూర్య ఉన్నత విద్యావంతురాలు. పైగా భారత్ తో సంబంధాలు ముడిపడి ఉన్నవారు. శ్రీలంకకు సిరిమావో బండారు నాయకె తర్వాత ప్రధాని అయిన మహిళగా నిలిచారు. మొత్తమ్మీద లంకకు 16వ ప్రధాని ఈమె. విద్యావేత్త నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన హరిణి.. ఢిల్లీలో చదువుకున్నారు. 1991-94 మధ్యన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిందూ కాలేజీలో డిగ్రీ చదివారు. సోషియాలజీ ఆమె సబ్జెక్ట్.

ఆ మూడేళ్లు.. జీవితం మలుపు తిరిగింది

ఢిల్లీలో మూడేళ్ల చదువు.. కాలేజీలో జరిగే పోటీలు, పండుగల్లో ఉత్సాహంగా పాల్గొనడం హరిణి జీవితాన్ని మలుపుతిప్పింది. ఇదే విషయాన్ని హిందూ కాలేజీ ప్రిన్సిపల్ అంజూ శ్రీవాత్సవ తెలిపారు. తమ కాలేజీ పూర్వ విద్యార్థిని ఓ దేశానికి ప్రధాని కావడం ఎంతో సంతోషకరమన్నారు. తమ కాలేజీలో ఏటా విద్యార్థి ఎన్నికలు జరుగుతాయని.. ప్రధాని, ప్రతిపక్ష నేతలను ఎన్నుకుంటామని చెప్పారు. 1990ల ప్రారంభంలో ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ వంటి వారు హిందూ కాలేజీ విద్యార్థులుగా ఉన్నారని అప్పట్లో కాలేజీ హాస్టల్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన నలిన్ రాజన్ సింగ్ తెలిపారు. ఆయన హరిణికి క్లాస్ మేట్ కావడం విశేషం. శ్రీలంక ప్రధాని హోదాలో ఆమె తమ కాలేజీని మళ్లీ సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

భారత్-లంక బంధం బలోపేతం

కొన్నాళ్లుగా శ్రీలంక చైనాకు దగ్గరవుతోంది. ఒకప్పుడు భారత్ పై ఆధారపడిన ఆ దేశం ఇప్పుడు దూరందూరంగా ఉంటోంది. అయితే, దిసనాయకె వంటి లెఫ్టిస్ట్ నాయకుడు, హరిణి వంటి ఢిల్లీ కాలేజీ పాత విద్యార్థి అధ్యక్ష, ప్రధానులుగా ఉన్నందున ఇరు దేశాల సంబంధాలు పాత స్థితికి వస్తాయని భావిస్తున్నారు. విద్యావంతురాలైన హరిణికి.. విద్య, న్యాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి అత్యంత కీలక శాఖలు అప్పగించారు. మరోవైపు శ్రీలంక పార్లమెంటును అధ్యక్షుడు దిసనాయకే రద్దు చేశారు. నవంబరు 14న వారి పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News