కాపుల సంగతేంటి.. : జోగయ్య రచ్చ స్టార్ట్
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, 80 ఏళ్ల పైబడి వయసున్న కురువృద్ధుడు, మాజీ మంత్రి హరిరామ జోగ య్య మళ్లీ రచ్చ స్టార్ట్ చేశారు
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, 80 ఏళ్ల పైబడి వయసున్న కురువృద్ధుడు, మాజీ మంత్రి హరిరామ జోగ య్య మళ్లీ రచ్చ స్టార్ట్ చేశారు. తాజాగా ఆయన ఏపీ ప్రబుత్వానికి లేఖ సంధించారు. కాపుల సంగతేంటో తేల్చండి! అంటూ.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆయన టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 50 రోజులు అయినా.. కాపుల రిజర్వేషన్ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలనేది అనాదిగా ఉన్న డిమాండ్‌గా జోగయ్య పేర్కొన్నా రు. ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్‌లో 5 శాతాన్ని కాపులకు ఇస్తూ.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. దీనిని కేంద్రం ఆమోదించిందో లేదో కూడా తెలియదని.. ఇప్పటి వరకు దీనిని వైసీపీ సర్కారు తొక్కిపెట్టిందని, మరి ఇప్పుడు ఏం చేస్తారని జోగయ్య నిలదీశారు. కాపుల ఉద్యమాలను కూడా గతంలో రెండుప్రభుత్వాలు నయానో.. భయానో .. అణిచి వేశాయని తెలిపారు.
ఇప్పుడు కేంద్రంలోనూ. రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉన్న దరిమిలా.. కాపులకు న్యాయం చేయాల ని జోగయ్య డిమాండ్ చేశారు. కాపు రిజర్వేన్‌లపై తాము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నామన్న ఆయ న దీనిపై ప్రభుత్వం(వైసీపీ) వేసిన కౌంటర్‌ను వెనక్కి తీసుకుని కాపులకు రిజర్వేషన్ విషయంలో న్యాయం చేయాలని ఆయన కోరారు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌కు ఇప్పుడు కూడా న్యాయం చేయకపోతే. మున్ముందు ఉద్యమాలు తప్పవని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
ఇక, గతంలో జోగయ్య జనసేన అధినేత పవన్‌ను భారీగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. జనసేన- టీడీపీతో కలిసి.. కాపును తాకట్టు పెడుతోందని.. ఒక పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని కూడా ఎన్నికలకు ముందు రచ్చ చేశారు. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ఎన్ని సీట్లు తీసుకుంటున్నారో.. ఎన్ని మంత్రి పదవులు తీసుకుంటున్నారోచెప్పాలంటూ.. అప్పట్లో యాగీ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఒకింత గ్యాప్ తీసుకుని మళ్లీ లేఖలు సంధించడం ప్రారంభించారు. దీనిపై సర్కారు స్పందిస్తుందో.. లేదో చూడాలి.