ఇదేం కల్చర్? కేసు నమోదు చేస్తే అడ్డుకోవటం ఏంటి హరీశ్?
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంత మాత్రాన చట్టం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోవాలా? అంటే.. ప్రజాస్వామ్యంలో ఊరుకోవద్దనే చెబుతారు ఎవరైనా.
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంత మాత్రాన చట్టం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోవాలా? అంటే.. ప్రజాస్వామ్యంలో ఊరుకోవద్దనే చెబుతారు ఎవరైనా. కానీ.. అందుకో పద్దతి ఉంటుంది. ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వేళ.. దాన్ని అడ్డుకోవటానికి.. ముకుతాడు వేయటానికి కోర్టులు ఉన్నాయి. అన్నింటికి మించి కౌశ ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. కాస్త ఓపిక పడితే.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రభుత్వాలకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి.
ఈ విషయాన్ని ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ అధినేతతో పాటు కీలక నేతలకు అస్సలు అర్థం కావట్లేదా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. చట్టం ఎవరికి చుట్టం కాకున్నా.. తమకు మాత్రం చుట్టంగా ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తున్న గులాబీ ముఖ్యనేతల తీరు ఇప్పుడు చర్చగా మారింది. గులాబీ ఎమ్మెల్యే పాడె కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లిన పోలీసుల్ని అడ్డుకోవటానికి మాజీ మంత్రి హరీశ్ వెళ్లటం ఏమిటి? ప్రొసీజర్ ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా పోలీసులు వ్యవహరిస్తే.. ప్రశ్నించేందుకు వేదికలు ఉన్నప్పటికీ వాటిని వదిలేసి.. ‘బలం’ చూపేందుకు మొగ్గుచూపటం దేనికి నిదర్శనం?
కౌశిక్ రెడ్డి అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి (కొండాపూర్ లోని కోలా లగ్జారియా విల్లాస్) వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులకు.. ఇంటి తలుపు తెరవని పరిస్థితి. దీంతో.. తలుపులు తెరవాలని.. పోలీసులకు సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. దీంతో.. తలుపులు తెరిచారు కౌశిక్ రెడ్డి. అయితే.. అప్పటికే ఇంట్లో మాజీ మంత్రి హరీశ్ రావు ఉన్నారు. కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు హరీశ్ అభ్యంతరం వ్యక్తం చేయటం.. ఈ సందర్భంగా ఆయన్ను సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరీశ్ రావును విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తూ.. రేవంత్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. హరీశ్ ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంతోమంది నేతలు.. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ ను.. అరెస్టు చేసేందుకు అర్థరాత్రి వేళ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్టు చేయటం మర్చిపోలేం.
అంతేకాదు.. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడ్ని అదుపులోకి తీసుకొని.. ఆయన్ను దాదాపు పదిగంటలకు పైనే వివిద పోలీస్ స్టేషన్లకు తిప్పిన వైనాన్ని మరిచిపోలేం. అంతేనా.. ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు అప్పట్లో కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. అర్థరాత్రి వేళ తలుపులు బద్ధలు కొట్టి మరీ తనిఖీలు చేసిన తీరును మర్చిపోలేం. ఇలా ప్రముఖ నేతల ఇళ్ల తలుపుల్ని బద్ధలు కొట్టి మరీ నేతలకు చుక్కలు చూపినప్పుడు.. అప్పట్లో అధికారంలో ఉన్న హరీశ్ ఎందుకు మౌనంగా ఉన్నట్లు? అప్పుడు ప్రజాస్వామ్యం.. హక్కులు.. లాంటివి ఎందుకు గుర్తుకు రానట్లు? తాము పవర్ లో ఉంటే తమకు తోచినట్లుగా వ్యవహరించే గులాబీ నేతలు.. విపక్ష నేతలుగా ఉన్నప్పుడు తాము చెప్పిందే జరగాలన్న మైండ్ సెట్ నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.