"సినిమా వాళ్లను భయపెట్టి సీఎం మంచి చేసుకోకూడదు!"

ప్రస్తుతం తెలంగాణలో ఎటు చూసినా... సంధ్య థియేటర్ ఘటన, తదనంతర రాజకీయ పరిణామాల కేంద్రంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-12-26 14:02 GMT

ప్రస్తుతం తెలంగాణలో ఎటు చూసినా... సంధ్య థియేటర్ ఘటన, తదనంతర రాజకీయ పరిణామాల కేంద్రంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అసెంబ్లీలో రేవంత్ వివరణ, తర్వాత అల్లు అర్జున్ ప్రకటన, అనంతరం పోలీసుల విచారణ.. తాజాగా సీఎంతో సినిమా పెద్దల భేటీ ఇలా వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. మరింత ఆసక్తికర చర్చ మొదలైందని అంటున్నారు.

మరోపక్క.. ప్రధానంగా.. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో సుమారు మూడు వారాలుగా చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను ఒక్కొక్కరుగా వెళ్లి పరామర్శిస్తున్నారు. అతడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు, మరికొంతమంది బీఅరెస్స్ నేతలు శ్రీతేజ్ ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు.

అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి తాజాగా బీఆరెస్స్ నేతలు పరామర్శించారు. ఇందులో భాగంగా... హరీశ్ రావు తో పాటు వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నవీన్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన మాజీ మంత్రి, బీఆరెస్స్ కీలక నేత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు చెప్పారని అన్నారు. బాలుడు త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటామని.. బాలుడి కుటుంబానికి తాము అండగా ఉంటామని.. బాలుడి తండ్రి భాస్కర్ కు మనోధైర్యం ఇమ్మని కేసీఆర్ ఆదేశించారని అన్నారు.

ఇదే సమయంలో... మృతి చెందిన రేవతి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్లు తెలిపిన హరీష్ రావు... తాజాగా సీఎం జరిగిన సినీ పెద్దల భేటీపైనా స్పందించారు. ఇందులో భాగంగా... సినిమా వాళ్లను భయపెట్టి సీఎం మంచి చేసుకోకూడదని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు.

అదేవిధంగా... సంధ్య థియేటర్ ఘటనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 రోజూ తర్వాతే స్పందించారని ఆరోపించిన హరీశ్ రావు.. అప్పటివరకూ సీఎం, మంత్రులు ఎందుకు సైలంట్ గా ఉన్నారని ఆక్షేపించారు. ఇటీవల ఈ విషయాన్ని అసెంబ్లీలో ఈ తొక్కిసలాట ఘటనను ప్రస్తావించి రాజకీయం చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఉందని ఫైరయ్యారు!

ఈ విషయంపై ఈ స్థాయిలో స్పందిస్తున్న సీఎం.. గురుకులాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన సందర్భాలు లేవని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... చట్టం అందరికీ సమానం అని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణమైన సీఎం తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News