కేటీఆర్, హరీష్ లకు ఆ రెండూ ప్రతిష్టాత్మకం !
శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది.
శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుని ఆ పార్టీని బలహీనపర్చాలని రేవంత్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఈ నేపథ్యంలో పార్టీని, నాయకులను, క్యాడర్ ను కాపాడుకోవాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఒకవైపు కేసీఆర్ బస్సుయాత్ర, మరో వైపు కేటీఆర్, హరీష్ రావులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ కేటీఆర్, హరీష్ రావులకు కరీంనగర్, మెదక్ లోక్ సభ స్థానాల్లో విజయం ప్రతిష్టాత్మకంగా మారింది.
కేటీఆర్ స్వంత నియోజకవర్గం సిరిసిల్ల కరీంనగర్ లోక్ సభ పరిధిలో ఉంది. అక్కడ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బీఅర్ఎస్ నుండి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ నుండి, రాజేందర్ రావు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. గతంలోనూ ఇక్కడ ఓడిపోయి సానుభూతితో లోక్ సభ ఎన్నికల్లో గెలిచాడు. ఈసారి బండి అదే ఫార్ములా పాటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈసారి వినోద్ కుమార్ ను ఎలాగైనా గెలిపించాలన్న లక్ష్యంతో కేటీఆర్ ప్రచారం చేస్తున్నాడు. మోడీ హవాలో మరోసారి విజయం ఖాయమని బండి సంజయ్ భావిస్తున్నాడు.
మెదక్ లోక్ సభ స్థానం పరిధిలో హరీష్ రావు సిద్దిపేట, కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో మెదక్ స్థానం నుండి కేసీఆర్ విజయం సాధించారు. స్వంత జిల్లా, స్వంత నియోజకవర్గాలు ఉన్న మెదక్ లోక్ సభ స్థానం బీఅర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇదే జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి, శాసనమండలి సభ్యుడు వెంకట్రామ్ రెడ్డిని మెదక్ స్థానం నుండి బీఆర్ఎస్ బరిలోకి దించింది. దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఓడిన రఘునందన్ రావు బీజేపీ నుండి, పటాన్ చెరులో ఎమ్మెల్యేగా ఓడిన నీలం మధును కాంగ్రెస్ బరిలోకి దించింది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పై 3.17 లక్షల భారీ ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించాడు. ఈసారి ఎన్నికల్లో మెదక్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని హరీష్ రావు శ్రమిస్తున్నాడు.