హరీష్ వలలో రేవంత్ చిక్కాడా ?

రుణమాఫీ. గత నెల రోజులుగా ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది.

Update: 2024-08-21 06:58 GMT

రుణమాఫీ. గత నెల రోజులుగా ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. డిసెంబరు 9న ఒకేసారి రూ.2 లక్షల రైతుల రుణాలను మాఫీ చేస్తాం అని అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ ఇది. ఇక రేవంత్ ఓ అడుగు ముందుకు వేసి కేసీఆర్ రూ.లక్ష మాత్రమే రుణమాఫీ అన్నాడు. మాఫీ అయిన వాళ్లు ఒకటి కాదు రూ.2 లక్షలు రుణం తెచ్చుకోండి అంటూ పిలుపునిచ్చాడు.

ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న తర్వాత సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ విషయంలో వత్తిడి పెరిగింది. బీఆర్ఎస్ నుండి కూడా దీనిపై విమర్శలు మొదలయ్యాయి. ఈ లోపు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని తెలంగాణలోని అన్ని దేవుళ్ల మీద ఒట్టేసి చెప్పాడు. ఎన్నికల తర్వాత మరింత వత్తిడి పెరిగింది.

వాస్తవంగా బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష వరకు రుణాలు రూ.16,144 కోట్లు నాలుగు విడతల్లో చేశారు. రెండోసారి హామీ ఇచ్చినా కరోనాతో నిధుల సమస్య ఏర్పడింది. రూ.లక్ష వరకు రుణాలు రూ.19,440 కోట్లకు గాను రూ.13,000.51 కోట్లు చెల్లించారు.

రుణమాఫీ ఒకేసారి చేయడం అసాధ్యం కావడంతో పాటు, మిగిలిన పథకాల అమలుకు సమస్యలు వస్తాయనే బీఆర్ఎస్ హయాంలో విడతల వారీగా చేశారు. అయితే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.41 వేల కోట్ల రుణమాఫీని రూ.31 వేల కోట్లకు కుదించి మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇది అసాధ్యం అని తెలిసి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీ చేస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు.

హరీష్ రావు సవాల్ ను అంచనా వేయడంలో సీఎం రేవంత్ గురి తప్పాడు. రైతుభరోసా కింద రూ.15 వేల కోట్లను పక్కన పెట్టినా రుణమాఫీ సాధ్యం కాలేదు. మూడు విడతల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసి రుణమాఫీ పూర్తయిందని సీఎం హోదాలో రేవంత్ ప్రకటించడంతో రైతుల్లో గందరగోళం చెలరేగింది.

రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి శవయాత్రలకు దిగడంతో ప్రభుత్వంలో గందరగోళం రేగింది. దీంతో మరో 12 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని, సాంకేతిక కారణాలు, రైతులను గుర్తించడంలో పొరపాట్ల మూలంగా సమస్య ఏర్పడిందని మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేసినా అందరు రైతులకు కాకపోవడం, రుణమాఫీ కాని రైతులు ఎక్కువగా ఉండడంతో రుణమాఫీ విషయంలో విమర్శలతో పాటు, రైతుభరోసా ఇవ్వకుండా నిధులు మళ్లించారని అపవాదు మీదపడింది. రుణమాఫీ విషయంలో ఎలాంటి కసరత్తు చేయకుండా సవాళ్లు విసిరారని ఒక వాదనతో పాటు, వ్యూహాత్మకంగా హరీష్ రావు విసిరిన వలలో రేవంత్ చిక్కారని మరో వాదన వినిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ రుణమాఫీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందని చర్చ నడుస్తున్నది.

Tags:    

Similar News