బాబు ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అంటూ...!?

ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టి నాలుగు నెలలు నిండి అయిదవ నెలలోకి అడుగుపెట్టింది.

Update: 2024-10-17 03:52 GMT

ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టి నాలుగు నెలలు నిండి అయిదవ నెలలోకి అడుగుపెట్టింది. అటువంటి కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అంటున్నారు. గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్

ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబెట్టారు. ప్రజలను ఉచిత హామీల పేరుతో వంచించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం దారుణం అన్నారు

అందుకే ఈ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టుకి వెళ్తామని హర్షకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోర్టుని కోరుతామని ఆయన అంటున్నారు. సూపర్ సిక్స్ అన్నారు. అలవి కాని హామీలు ఇచ్చారు. ఉచితాలు అన్నారు, సంక్షేమ పధకాలు అన్నారు, ఇప్పటిదాకా ఏ ఒక్కటి అయినా అమలు చేశారా చంద్రబాబూ అని ఆయన ప్రశ్నించారు.

అసలు మీరు ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అని ప్రశ్నించారు. నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు కదా ఏమైంది ఆ హామీ అని నిలదీశారు ఇపుడు పట్టభద్రులు టీడీపీ కూటమి తరఫున నిలబడే ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. వారంతా అమాయకులు అనుకుంటున్నారా అని కూడా ఆయన గద్దించారు. ఇదిలా ఉంటే తాను పెట్టబోయే కొత్త పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్ధిని నిలబెట్టి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హర్షకుమార్ అన్నారు

జగన్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదని చెప్పారని ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా షరా మామూలే అని ఆయన అన్నారు. చంద్రబాబు ఇంటి మీద దాడి జరిగితే సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం గత అయిదేళ్ల వైసీపీ పాలనలో దళితుల మీద జరిగిన దాడుల మీద ఎందుకు విచారణ జరిపించదని ఆయన ప్రశ్నించారు.

దళితులకు ఒక న్యాయం పాలకులకు మరో న్యాయమా అని నిగ్గదీశారు. ఏపీలో కూటమి దారుణమైన పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటుతో సరైన తీర్పు ఇస్తారని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి తరఫున 18 మంది ఎమ్మెల్యేలు కలసి అభ్యర్ధిని నిలబెడుతున్నారని గెలిపించుకోవాలని చూస్తున్నారని అయితే ప్రజలు మాత్రం తమ అభ్యర్ధికే ఓటు వేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. హర్షకుమార్ ఇటీవల కాలంలో వరసగా బాబు మీద కూటమి మీద విమర్శలు చేస్తున్నారు. మరి చూడాలి ఆయన అభ్యర్ధి ఏ విధంగా నెగ్గుకుని వస్తారో.

Tags:    

Similar News