షర్మిలకు.. మీడియా పవర్ తెలిసొచ్చిందా ..!
సాధారణంగా ఏపీలో మీడియా ఇప్పుడు కూటమి ప్రభుత్వ అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో విజయమ్మ, షర్మిలలు.. జగన్‌ను తిట్టినంత సేపు మాత్రమే వారికి ఈ మీడియా కవరేజీ ఇస్తోంది.
వైసీపీని విమర్శించినంత కాలం.. వైసీపీ అధినేత, తన సొదరుడు మాజీ సీఎం జగన్‌ను తిట్టిపోసినంత కాలం.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల హవానే వేరు. ఆమె ఏం మాట్లాడినా.. మీడియా పెద్ద ఎత్తున కవరేజీ ఇచ్చింది. పెద్ద పెద్ద హెడ్డింగులతోనూ.. ఆమెను మోసేసింది. దీంతో ఒకానొక దశలో మరింత చెలరేగిపో యిన షర్మిల.. తనకు తిరుగులేదన్నట్టుగా వ్యవహరించారు. తాను ఏం మాట్లాడినా చెల్లుందని కూడా భావించారు.
కానీ, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో కోణం వైపు నుంచి చూస్తే.. గత మూడు రోజులుగాకూడా షర్మిల యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ, ఆమె గురించి.. ఏ మీడియాలోనూ ఒక్క మాట కూడా రాలేదు. సోషల్ మీడియా కూడా షర్మిలను పట్టించుకోవడం లేదు. ఆమె ఊసు కూడా లేకుండా పోయింది. పోనీ.. ఆమె ఏమన్నా మౌనంగా ఉన్నారా? అంటే అలా కూడా లేరు. మూడు రోజులుగా పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు.
ఆమె ఒక్కరే కాదు.. జగన్ మాతృమూర్తి విజయమ్మ కూడా స్పందిస్తున్నారు. కానీ, వీరిద్దరి గురించి మీడియా ఎక్కడా ఇప్పుడు స్పందించడం లేదు. కనీసం ఒక్క చిన్న వార్తను కూడా రాయడం లేదు. నిన్న మొన్నటి వరకు షర్మిల ఎలా స్పందిస్తుందో.. విజయమ్మ ఏం మాట్లాడుతుందో అని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన ఈ మీడియా.. ఇప్పుడు పూర్తిగా మౌనంగా ఉంది. దీంతో షర్మిల, విజయమ్మలు ఎవరు మాట్లాడినా.. ఎవరికీ వినిపించడం లేదు. కనిపించడమూ లేదు.
ఎందుకు...
సాధారణంగా ఏపీలో మీడియా ఇప్పుడు కూటమి ప్రభుత్వ అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో విజయమ్మ, షర్మిలలు.. జగన్‌ను తిట్టినంత సేపు మాత్రమే వారికి ఈ మీడియా కవరేజీ ఇస్తోంది. అంతకుమించి కూటమి సర్కారు పాలసీలపై ఏమాత్రం వ్యాఖ్యలు చేసినా మానేస్తోంది. ఇదే గత నాలుగు రోజులుగా సాగుతోంది. అంతేకాదు.. సోషల్ మీడియాలోనూ వీరికి ప్రాధాన్యం లేకపోవడానికి ఇదే కారణం. ఇది.. సాధారణంగా ఎక్కడైనా జరిగేదే.
దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా ప్రభుత్వ అనుకూలంగానే మీడియా పనిచేస్తున్న దరిమిలా.. ఎవరూ దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మరోవైపు.. జగన్ సొంత మీడియాలోనూ షర్మిల, విజయమ్మల వార్తలను పూర్తిగా ఎడిట్ చేయడం గమనార్హం. దీంతో ఇప్పుడు వీరికి మీడియా పవర్ ఏంటో అర్ధమై ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.