హ్యాట్రిక్ విజయాలు బీజేపీకే సొంతాలు

కానీ అతి సులువుగా హ్యాట్రిక్ విజయాలను బీజేపీ నమోదు చేస్తోంది.

Update: 2024-10-09 07:35 GMT

ఒకసారి గెలవడమే రాజకీయ పార్టీలకు కష్ట సాధ్యం అవుతోంది. దానికి రెండోసారి రిపీట్ చేయాలంటే చాలా కష్టాలు పడాల్సిందే. కానీ అతి సులువుగా హ్యాట్రిక్ విజయాలను బీజేపీ నమోదు చేస్తోంది. అది కూడా అప్పటిదాకా ఆయా రాష్ట్రాలలో లేని ట్రెండ్ ని సృష్టిస్తోంది.

బీజేపీ తాజాగా హర్యానాలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. నిజానికి ఇక్కడ రెండు సార్లు వరసగా గతంలో కాంగ్రెస్ కూడా గెలిచింది. ఈసారి గెలుపు బీజేపీకి కష్టం అనుకుంటున్న నేపథ్యంలో బీజేపీ దానిని సుసాధ్యం చేసి చూపించింది. ఔరా అనిపించింది.

ఇంతే కాదు దేశంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో అనేకం ఉన్నాయి. బీజేపీకి కంచుకోట లాంటి గుజరాత్ లో ఆ పార్టీ డబుల్ హ్యాట్రిక్ నే సాధించి మూడవ హ్యాట్రిక్ దిశగా సాగుతోంది. 1995 నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అంటే మూడు దశాబ్దాల కాలం అన్న మాట. కాంగ్రెస్ తరువాత ఈ రికార్డు బీజేపీకే సొంతం.

ఇక మధ్యప్రదేశ్ లో చూస్తే బీజేపీ 2003 నుంచి ఈ రోజు దాకా అధికారంలో ఉంటూనే వస్తోంది. అంటే సుదీర్ఘంగా 21 ఏళ్ళ నుంచి అన్న మాట. ఈ మధ్యలో అయిదు ఎన్నికలను బీజేపీ ఎదుర్కొంది. అంటే ఇప్పటికే హ్యాట్రిక్ సాధించేసింది. డబుల్ హ్యాట్రిక్ కి 2028లో జరిగే ఎన్నికలు సరిపోతాయి. అపుడు కూడా గెలిస్తే బీజేపీ డబుల్ హ్యాట్రిక్ ఖాతాలోకి మధ్యప్రదేశ్ వస్తుంది.

ఇక చత్తీస్ ఘడ్ రాష్ట్రం తీసుకుంటే 2003 నుంచి 2018 దాకా మూడు సార్లు వరసగా ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. 2018లో ఓటమి పాలు అయినా 2023లో మళ్లీ అధికారంలోకి వచ్చింది. అదే విధంగా గోవా వంటి రాష్ట్రంలో అయితే 2012 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ 2022లో నాలుగోసారి గెలిచింది. అంటే డబుల్ హ్యాట్రిక్ దిశగా సాగుతోంది అన్న మాట.

ఇక దేశంలో పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ లో వరసగా రెండు సార్లు గెలిచింది. ఉత్తరాఖండ్ లోనూ రెండు సార్లు గెలిచింది. మణిపూర్ లోనూ అదే జరిగింది. ఇలా దేశంలో బీజేపీ వరస విజయాలు అందుకున్న రాష్ట్రాలు చాలానే కనిపిస్తున్నాయి. బీజేపీ విషయం ఏంటి అంటే ఒకసారి అధికారం అందుకుంటే ఇక ఓటమి వైపు చూడకుండా పార్టీ నిర్మాణం ఎలా చేయాలో బాగా తెలుసు.

పైగా ఆరెస్సెస్ తోడు కూడా ఉంటుంది. అందుకే బీజేపీకి అధికారం అప్ప చెప్పొద్దు అని అంతా అంటారు. బీజేపీ కనుక ఒక్కసారి వచ్చిందంటే పాతుకుని పోతుంది అని చరిత్ర చెబుతోంది. అంతలా బీజేపీ తన పొలిటికల్ ఫిలాసఫీతో ముందుకు సాగుతోంది. దేశంలో ఇతర పార్టీలు బీజేపీ వరస విజయాలను చూసి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది.

పార్టీకే బీజేపీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఎంతటి సీనియర్ ని అయినా అవసరం లేదు అనుకుంటే తప్పించేస్తుంది. అదే విధంగా సామాజిక సమీకరణలతో పాటు ప్రజల కోణంలో కూడా ఆలోచించి చివరి క్షణంలోనూ సీఎం లను మార్చేస్తుంది. అలాగే హర్యానాలో ఎన్నికల ముందు మనోహార్ ఖట్టార్ ని మార్చేసి బీజేపీ ఘన విజయం అందుకుంది.

Tags:    

Similar News