హెచ్‌సీయూ భూముల వివాదంపై ప్రకాష్ రాజ్ ఆగ్రహం..
ఈ వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఆందోళనలు చేస్తున్న విద్యార్థులకు , పౌరులకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.;

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. విశ్వవిద్యాలయానికి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించేందుకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ వివాదంపై ఇప్పటికే పలు రాజకీయ నాయకులు, ప్రముఖులు స్పందించగా, తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన గళం విప్పారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) భూముల రక్షణ కోసం విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ వివాదానికి రాజకీయ పార్టీల నాయకులు, అధ్యాపకులు, మేధావులు సైతం విద్యార్థులకు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఒకప్పటి హెచ్‌సీయూ విద్యార్థి సంఘ నాయకుడు మాట్లాడుతూ "విద్యా సంస్థల యొక్క భూములు విద్యార్థుల యొక్క విద్యా , పరిశోధన అవసరాల కోసం ఉపయోగపడాలి. వాటిని వ్యాపార ప్రయోజనాల కోసం వదులుకోకూడదు" అని అభిప్రాయపడ్డారు.
ఈ వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఆందోళనలు చేస్తున్న విద్యార్థులకు , పౌరులకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. విద్యాసంస్థల భూములను వ్యాపార అవసరాల కోసం తాకట్టు పెట్టడం అత్యంత దౌర్భాగ్యమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తక్షణమే స్పందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తే భవిష్యత్ తరాలు ప్రశ్నించకుండా ఉండవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వాల నుండి ఇలాంటి నిర్ణయాలు విద్యా వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఆ భూమి తమదేనని స్పష్టం చేసింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేట్ సంస్థకు కేటాయించిన ఈ భూమిని న్యాయపోరాటం ద్వారా తిరిగి దక్కించుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొన్ని రాజకీయ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.
ప్రస్తుతం ఈ వివాదం కొనసాగుతుండగా ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖుల స్పందన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యాసంస్థల భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.