ఇక క్యాన్సర్ మహమ్మారికి చెక్.. 6 నెలల్లో వ్యాక్సిన్

భారతదేశంలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పిల్లలు, పెద్దలు, స్త్రీ, పురుష బేధం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

Update: 2025-02-19 11:37 GMT

కాలం మారుతోంది. ఎంత టెక్నాలజీ పెరుగుతోందో అంతే రోగాలు ముదురుతున్నాయి.. కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి అందరినీ ఇంట్లో కూర్చుండబెట్టింది. అయితే ఆ రోగం పోయినా ఇప్పుడు పెరుగుతున్న క్యాన్సర్ మహామ్మారి కేసులు అందరినీ భయపెడుతున్నాయి. ముఖ్యంగా బాలికలకు ఇది మరణ శాసనం రాస్తోంది. అందుకే ప్రభుత్వం అప్రమత్తమై తాజాగా టీకాను రెడీ చేస్తోంది. అది ట్రయల్స్ పూర్తి అయ్యి 6 నెలల్లోనే అందుబాటులోకి రావడానికి రంగం సిద్ధమైంది.

భారతదేశంలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పిల్లలు, పెద్దలు, స్త్రీ, పురుష బేధం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బాధితుల సంఖ్య ఏడాదికి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై, క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య, సంక్షేమ, ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌ తెలిపారు. మరో ఐదు నుంచి ఆరు నెలల్లో 9 నుంచి 16 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

-పెరుగుతున్న క్యాన్సర్‌ బాధితుల సంఖ్య

దేశంలో క్యాన్సర్‌ కేసులు ఏటా పెరుగుతున్నాయి, ముఖ్యంగా మహిళలు అధికంగా ప్రభావితమవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆస్పత్రుల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించింది. అలాగే, క్యాన్సర్‌ను తొందరగా గుర్తించేందుకు డేకేర్‌ క్యాన్సర్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి జాదవ్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్ల ప్రభావం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

-ఉచితంగా వ్యాక్సిన్‌ అందుబాటు

వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తయ్యాక 9 నుంచి 16 ఏళ్ల బాలికలకు ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్‌ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలను పెంచుతూ, ఆధునిక వైద్య సేవలను మెరుగుపరుస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించింది. మొత్తంగా, క్యాన్సర్‌ వ్యాధిని నియంత్రించేందుకు కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది.

Tags:    

Similar News