గడ్డ కట్టిన అమెరికా.. 2011 తర్వాత అత్యంత కష్ట కాలం
అమెరికాలో భారీ మంచు తుఫాను 15 పైగా రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. దీంతో 6 కోట్ల మంది ప్రభావితం కానున్నారు.
అమెరికా వణుకుతోంది.. శీతల గాలులతో గడ్డ కట్టుకుపోతోంది.. 14 ఏళ్ల కిందటి వాతావరణ బీభత్సాన్ని తలపిస్తోంది.. ఒకటికి పది రాష్ట్రాలు ప్రభావితం అవుతున్నాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.. దీనికితోడు భారీ వర్షం ముప్పు ముంగిట అమెరికా నిలిచింది. ఈ దశాబ్దిలోనే అతి తీవ్ర తుపానుగా వాతావరణ శాఖ దీనిని అంచనా వేస్తోంది.
6 కోట్ల మంది ప్రభావితం
అమెరికాలో భారీ మంచు తుఫాను 15 పైగా రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. దీంతో 6 కోట్ల మంది ప్రభావితం కానున్నారు. దీనంతటికీ కారణం.. మధ్య అమెరికాలో మొదలైన శీతల తుఫాను. పోలార్ వర్టెక్స్ తో ఇది తూర్పు దిశగా కదులుతోందట. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
మిస్సౌరీ రాష్ట్రం నుంచి మధ్య అట్లాంటిక్ వరకు మంచు తుఫాను విస్తరించనుందట. 2011 తర్వాత ఇదే అతి తీవ్ర శీతల తుఫాను అంటున్నారు. దీంతో ప్రయాణం ప్రమాదకరం అనే హెచ్చరికలు జారీ చేశారు. పైగా ఇదే తీవ్రత వారం పాటు ఉంటుందట.
రాష్ట్రాలు అలర్ట్..
ప్రస్తుత పరిస్థితుల రీత్యా కెంటకీ, వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలు ఎమర్జెన్సీ విధించాయి. దక్షిణాదిన ఉన్న మిస్సిస్సిపీ, ఫ్లోరిడా కూడా ప్రమాదకర చలి వాతావరణం హెచ్చరికలు జారీ చేశాయి. మిస్సౌరీ, ఇల్లినోయీలో భారీ మంచు వర్షం ప్రమాదం ఉందట. ఇక కన్సాస్, ఇండియానాల్లో 20 సెం.మీ, వర్జీనియాలో 10-25 సెం.మీ మేర మంచు కురుస్తుందని ఆక్యు వెదర్ తెలిపింది.
వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్, ఫిలడెల్ఫియాలు సిద్ధం అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో వాహనదారులు మంచులో చిక్కుకుపోయే ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి.