ఎలక్షన్ ఎఫెక్ట్: హెలికాప్టర్లకు ఎంత డిమాండంటే..!
హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగిపోయింది. గంట వినియోగానికి రూ.లక్షల్లోనే వసూలు చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో అవసరం ఉంటే తప్ప హెలికాప్టర్లను నాయకులు వినియోగించరు.
హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగిపోయింది. గంట వినియోగానికి రూ.లక్షల్లోనే వసూలు చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో అవసరం ఉంటే తప్ప హెలికాప్టర్లను నాయకులు వినియోగించరు. అయితే.. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడం.. పోటీ తీవ్రంగా ఉండడంతో ఆయా జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న నాయకులు.. రోడ్డు మార్గంలో కాకుండా.. వాయు మార్గాన్ని ఎంచుకుంటున్నా రు. ఒకే రోజు రెండు నుంచి మూడు నాలుగు జిల్లాలను కవర్ చేసి.. ప్రచారంలో దూసుకుపోయేందుకు హెలికాప్టర్‌ను మించిన ప్రయాణ సాధనం ఇంకోటి లేదని నిర్ణయించుకున్నారు.
దీంతో దాదాపు అన్ని ప్రధాన పార్టీల్లోని కీలక నాయకులు కూడా హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. దీంతో హెలికాప్టర్లకు భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో(ఇప్పటికి నాలుగు అయిపోయాయి) నాయకులు ఎక్కువగానే హెలికాప్టర్ను వినియోగించారు. దీంతో వాటికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఇక, ముఖ్యంగా తెలంగాణలో కూడా అధికారపార్టీ బీఆర్ ఎస్ నుంచి ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల వరకు కూడా హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. వాటిని అద్దెకు తీసుకుని.. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు.
ముంబైకి చెందిన ప్రైవేటు సంస్థ 'ఫ్లైయింగ్ బర్డ్స్' ఏవియేషన్.. ఏకంగా నాలుగు హెలికాప్టర్లు, ఆరు జెట్లను నడుపుతోంది. ప్రస్తుతం ఈ సంస్థకు డిమాండ్ పెరగడంతో మరికొన్ని హెలికాప్టర్లను కూడా అద్దెకు తీసుకుంది. ఇక, యూపీలోని గురుగ్రామ్ కు చెందిన 'బ్లేడ్ ఇండియా' సంస్థ కూడా.. ఇదే పనిచేస్తోంది. ఈ రెండు సంస్థల హెలికాప్టర్లకు ఎక్కడా లేని డిమాండ్ పెరిగిపోయింది. అయితే.. ఇది(ఐదు రాష్ట్రాల ఎన్నికలు) ప్రారంభం మాత్రమేనని.. అసలు డిమాండ్ 2024లో ఉంటుందని ఫ్లయింగ్ బర్డ్స్ సీఈవో ఆశిష్‌కుమార్ చెప్పారు.
అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్
2024 ఎన్నికలకు సంబంధించి పలు పొలిటికల్ పార్టీలు అప్పుడే హెలికాప్టర్లను బుక్ చేసుకున్నాయని ఆశిష్‌కుమార్ వెల్లడించారు. 2019 ఎన్నికల సమయంలో 70 నుంచి 100 హెలికాప్టర్లకు డిమాండ్ వచ్చిందని.. అయితే.. తమ వద్ద కేవలం 40 మాత్రమే అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇక, జెట్స్ డిమాండ్ 100 నుంచి 130 వరకు వెళ్లిందన్నారు. కానీ, తమ వద్ద 50 నుంచి 60 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు.
కాసుల పంట
రాజకీయ నేతల నుంచి హెలికాప్టర్లు, జెట్ల కోసం వస్తున్న డిమాండ్ ఆయా కంపెనీలకు కాసులు కురిపిస్తున్నాయి. అద్దెల రూపంలో వారు కోట్లకు కోట్లు సంపాయించుకుంటున్నారు. హెలికాప్టర్ రెంట్ గంటకు రూ.55 వేల నుంచి లక్షా 30 వేల వరకు ఉంది. ఇక, ఇప్పుడు డిమాండ్ నేపథ్యంలో దీనికి మూడు రెట్లు వసూలు చేస్తున్నారు. పార్టీలతో పనిలేకుండా.. నాయకులు గంటకు రూ.2 నుంచి 3.5 లక్షల వరకు వెచ్చిస్తున్నారని సంస్థలు చెబుతున్నాయి. ఇక, ఫ్యూయల్, ఎయిర్‌పోర్టు చార్జీలు, ల్యాండింగ్ ఖర్చు, సిబ్బంది ఖర్చులను నాయకులే భరిస్తున్నట్టు చెబుతున్నారు.
భద్రతా ఫీచర్లకు మరింత డిమాండ్
వివిధ రాజకీయ పార్టీల నాయకులు భద్రతా కారణాల దృష్ట్యా ట్విన్ ఇంజన్ హెలికాప్టర్‌లను ఇష్టపడుతున్నారు, ఇవి సింగిల్ ఇంజన్ ఛాపర్‌ల కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి. దేశంలో 155 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో మూడింట ఒక వంతు ప్రభుత్వ అనుబంధ సంస్థ పవన్ హన్స్ మాత్రమే కలిగి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి డిమాండ్ తీవ్రతరం కావడంతో అన్ని ప్రైవేట్ చార్టర్ కంపెనీలు తమ స్టాక్‌లను పెంచుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఆ సమయానికి మరో 5 హెలికాప్టర్లను పొందేందుకు బ్లేడ్ ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.